తెలంగాణలో తెరాసకు టీడీపీ అభిమానుల కావాలి! గతంలో కూడా వారి అభిమానం పొందడం కోసం కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేశారో చూశాం. జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో, ఆ తరువాత జిల్లాల్లో ఉండే టీడీపీ అభిమానుల్ని దగ్గర చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నాలేంటో చాలామందికి తెలుసు! ఇప్పుడు, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. తెరాసకు వ్యతిరేకంగా మహా కూటమిలో భాగంగా టీడీపీ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల పొత్తు అంశానికి సెంటిమెంట్ జోడించి… రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నానికి మంత్రి కేటీఆర్ మొదలుపెట్టేశారని చెప్పొచ్చు!
సీనియర్ నేత సురేష్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ… ఇద్దరు గడ్డపోళ్లూ ఒకటయిన్రు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెలంగాణకు అడ్డుపడ్డ రెండు గడ్డాలూ ఇవాళ్ల ఒక్కటవుతున్నాయన్నారు. అంతేకాదు, ‘ఏ పార్టీనైతే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు.. కాంగ్రెస్ ని బొందపెట్టడానికి పెట్టిండో, ఈ రోజు ఆ పార్టీని కాంగ్రెస్ కి తోకగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుకీ, ఇక్కడుంటే టీడీపీ నేతలకు దక్కుతుంది’ అన్నారు కేటీఆర్. తెలంగాణకు ద్రోహం చేసినవారంతా ఒక చోట చేరడం మంచిదేననీ, ఒకే దెబ్బతో ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని ఎద్దేవా చేశారు. జయశంకర్ చెప్పినట్టుగా తెలంగాణను పాలించే అధికారం మరోసారి మన చేతుల్లో పెట్టుకుందామా, కట్టు బానిసలు మాదిరిగా అమరావతి, ఢిల్లీలవైపు చూద్దామా అని ప్రశ్నించారు?
తెలంగాణయేతరం అంటూ టీడీపీని విమర్శిస్తూనే… టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు కేటీఆర్! అంటే, ఎన్టీఆర్ ను అభిమానించే టీడీపీ వారు వారికి కావాలి… కానీ, టీడీపీని తెలంగాణయేతర పార్టీగా చూడాలన్నమాట! స్థానికత సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుంటూనే టీడీపీ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం ఇది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. తెలంగాణకు టీడీపీ, కాంగ్రెస్ లు వ్యతిరేకమని సెంటిమెంట్ ను వాడుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. నిజానికి, తెలంగాణను టీడీపీ ఎప్పడూ వ్యతిరేకించలేదు కదా! రాష్ట్రంలో టీడీపీ స్తబ్దుగా ఉన్నంత కాలం… తెరాస వ్యవహరించి తీరు వేరేగా ఉంటూ వచ్చింది! ఇప్పుడు, రాష్ట్రంలో టీడీపీ యాక్టివ్ కావడంతో డీల్ చేసే విధానం మారిపోయింది. ఈ తేడాను ప్రజలు కూడా గమనించగలరు కదా!