మహాకూటమిపై కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తెలంగాణను అడ్డుకున్న వాళ్లంతా కలిసి… టీఆర్ఎస్ పైకి పోటీకి వస్తున్నారని… ప్రచారం ప్రారంభించారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇతర పార్టీలు మహాకూటమిలో భాగంగా.. ఉన్నా.. ఆ ప్రస్తావన తీసుకు రాకుండా… విమర్శలు గుప్పించారు. తెలంగాణకు అడ్డుపడ్డ రెండు గడ్డాలు ఏకమవుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ దృష్టిలో చంద్రబాబు తెలంగాణకు అడ్డం పడ్డారనుకున్నా.. ఉత్తమ్ పై కేటీఆర్ అలాంటి ఆరోపణలే చేయడం రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్కు టీడీపీని తోక పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబు, రమణదేనని విరుచుకుపడ్డారు. జుగుప్సాకరమైన, అపవిత్రమైన, నీచమైన కలయికగా టీడీపీ – కాంగ్రెస్ పొత్తును కేటీఆర్ తేల్చారు. కేటీఆర్ ప్రజలకు చాయిస్ ఇచ్చేశారు. టీఆర్ఎస్ కావాలా..? కాంగ్రెస్ – టీడీపీ ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలన్నారు.
బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపించిన చంద్రబాబు, ముదిగొండలో కాల్పులు జరిపిన కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయని మండిపడ్డారు. రైతులపై కాల్పులు జరిపినవారు ఒక్కటయ్యారని, తాము మాత్రం రైతులకు ఎంతగానో మేలుచేస్తున్నారని తెలిపారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారు. ఆ రెండు పార్టీలను వాయించి వాయించి ఒకటే సారి దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందన్నారు. తెలంగాణవాళ్లే ఈ రాష్ట్రాన్ని పాలిస్తే న్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రతిదానికోసం అమరావతి, దిల్లీ వైపు చూద్దామా? గల్లీలోనే నిర్ణయాలు తీసుకుందామా ఆలోచించుకోండి అని ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే.. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు తప్ప.. ఇంకెవరూ తెలంగాణ వాళ్లు కాదన్నట్లుగా కేటీఆర్ ప్రసంగం సాగింది.
మహాకూటమిగా పేర్కొనకుండా.. కేవలం కాంగ్రెస్ – టీడీపీ పొత్తులన్నట్లుగా ప్రచారం చేసేదుకు టీఆర్ఎస్ వ్యూహం సిద్దం చేసుకుని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తోందని.. కేటీఆర్ ప్రసంగం ద్వారా స్పష్టమయిందని తెలంగాణ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే నాలుగున్నరేళ్ల పాటు పరిపాలించిన తర్వాత.. అదీ తెలంగాణకు వ్యతికంగా పని చేసిన నేతలందర్నీ పక్కన పెట్టుకుని… తెలంగాణ కోసం పోరాడిన వారిని… అడ్డం పడిన వాళ్లంటూ.. కేటీఆర్ విమర్శలు చేయడంపై ప్రజల్లోకి వ్యతిరేకంగానే వెళ్తుందని… ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు. అంతిమంగా అతి టీఆర్ఎస్ కే మైనస్ చేస్తుందంటున్నారు. లెక్క తీస్తే.. టీఆర్ఎస్ లోనే ఎక్కువ మంది తెలంగాణ వ్యతిరేకులున్నారు మరి..!