కాంగ్రెస్ నేతలపై ఒంటికాలిపై లేచి విమర్శలు చేశారు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పొలాలు పచ్చగుంటే కాంగ్రెస్సోళ్లు చూసి ఓర్వలేకపోతున్నారనీ, ప్రాజెక్టుల్లో పడవలేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా సరే ఏం చెయ్యాలో తెల్వక.. ప్రాణహిత చేవెళ్లలో పడవలెక్కి తిరుగుతున్నారని అన్నారు. వాళ్ల మాటలు వింటుంటే పాడిందే పాడరా పాచిపళ్ల… అనే పాట గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు పడవలో తిరుగుతున్న ఫొటోని ఓ మిత్రుడు తనకు పంపాడనీ, అది చూడగానే గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం.. తీరమేమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం అనే పాట గుర్తుకొచ్చిందన్నారు కేటీఆర్. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ మీద నమ్మకం పోయిందనీ, ఆ పార్టీకి నాయకుడెవరు, ఎవరు నడిపిస్తున్నారో అనేది ముందుగా వారు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఇలా చమత్కారాలు జోడిస్తూ ఎన్ని విమర్శలైనా చెయ్యగల వాక్చాతుర్యం కేటీఆర్ కి ఉంది, దాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ, దీంతోపాటు కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన అంశంపై కూడా వివరణ ఇవ్వాలి కదా? ప్రాణహితలో పడవ ప్రయాణానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ఏమడిగారంటే… ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రూ. 22 వేలు కోట్లు మాత్రమేననీ, దీని అంచనాలు రూ. 38 వేల కోట్లు చేసి, ఇప్పటికే రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. మిగతా సొమ్మును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిని పదివేల కోట్లు ఖర్చుపెట్టినా ఈపాటికి ఈ ప్రాజెక్టు పూర్తయిపోయి, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లొచ్చి, పదహారున్నర లక్షల ఎకరాలకు నీళ్లందేవన్నారు. హైదరాబాద్ కి కూడా నీళ్లొచ్చేవన్నారు. నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండీ, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును చంపేసి, కేవలం అవినీతి చేయడం కోసమే కాళేశ్వరం అంచనాలు పెంచుకుంటూ పోతున్నారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ.
ఈ ఆరోపణలేవీ కేటీఆర్ మాటల్లో ప్రస్థావనకు లేవు. ప్రాణహిత చేవెళ్లను ఎందుకు పూర్తి చేయలేదో ఆయన చెప్పలేదు. తక్కువ ఖర్చుతోనే వెంటనే నీళ్లు అందుబాటులోకి వస్తాయని కాంగ్రెస్ నేతలు అంటుంటే… అది నిజమా వారి రాజకీయ ఆరోపణ అనేదీ కేటీఆర్ చెప్పలేదు. ఇంత తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదో అదీ చెప్పలేదు! ప్రతిపక్షంగా కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలు వేటిపైనా ఆయన మాట్లాడలేదు. కొన్ని చమత్కారాలు, కొన్ని సామెతలు, కొన్ని పాటలు.. వీటితో తాత్కాలికంగా రక్తికట్టించేశారు! కానీ, కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలు ఎంత కాదనుకున్నా ప్రజలకు వచ్చిన సందేహాలుగానే చూడాలి కదా! వారు అడిగే ప్రశ్నలకూ సమాధానం ఇవ్వాలి కదా!