సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?… అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు చాలా కోపం తెప్పించింది. బీజేపీ మహిళా నాయకులు విరుచుకుపడ్డారు. వారికి తోడుగా కేటీఆర్ కూడా వచ్చారు. కంగనా రాజకీయ అభిప్రాయాలతో తనకు పని లేదు కానీ మహిళా నేతలపై అలాంటి వ్యాఖ్యలను సమర్థించబోనన్నారు. కానీ అంత కంటే ఘోరంగా మహిళా గవర్నర్ పై , సీతక్కపై పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు కేటీఆర్‌కు ఖండించాలనిపించలేదు అది వేరే విషయం.
కేటీఆర్‌కు దానంపై చాలా కోపం ఉంది. అందకే బీజేపీ నేతల్ని సమర్థిస్తున్నా అనే భావం వస్తుందని తెలిసినా సరే ఆయన ఖండించేశారు. ఇప్పుడున్న వేడిలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు అంటే.. దానంపై అందరూ ఫైర్ అవుతారని కేటీఆర్ అనుకుని ఉండవచ్చు. కానీ బీఆర్ఎస్ మహిళా నేతలతో దానంను విమర్శింప చేస్తే సరిపోయేది కానీ ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. నిజానికి కంగనా ఏమైనా సాఫ్ట్ భాష మాట్లాడుతుందా అంటే.. అదేమీ లేదు. తోటి నటి ఊర్శినను సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్ అని తిట్టిపోసిన రికార్డు ఆమెది. రాహుల్ గాంధీని ఇంకా అనుచితంగా మాట్లాడారు.
రాజకీయాల్లో భాష రోజు రోజుకు దిగజారిపోతోంది. రాహుల్ గాంధీపై అత్యంత దారుణమైన భాషను బీజేపీ నేతలు వాడుతున్నారు. వారు అన్నారని.. ఇతర పార్టీల నేతలు అలాగే స్పందించారు. ఏపీలో ఇప్పుడు అలాంటి సౌండ్ పొల్యూషన్ లేదు కానీ.. గతంలో అయితే చాలా ఘోరంగా ఉండేది. ఇప్పుడు ఇతర చోట్ల ఆ పరిస్థితి కనిపిస్తోంది.