టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయశక్తి అని కేటీఆర్ కొత్త అర్థం చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. పార్టీని వందేళ్లపాటు తిరుగులేని శక్తిగా ఉండేలా తీర్చిదిద్దుతానని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అందరి మద్దతుతో కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించారు. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నానని.. తన కోసం తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారని.. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించారు. బంగారు తెలంగాణ కోసం సవ్యంగా పని నిర్వర్తిస్తానని … పార్టీ కార్యాలయాల నిర్మాణం, శిక్షణ, సంస్థాగత నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తానని .. భగవంతుడు తనకిచ్చిన శక్తిని వినియోగిస్తానన్నా రు. అంతకు ముందు బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి కళాకారుల ఆటపాటలు, నృత్యాల మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ కు నివాళులర్పించారు. ఆ తర్వాత తనకు కేటాయించిన చాంబర్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు బయల్దేరే ముందు కేటీఆర్.. తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లిదండ్రులు కేసీఆర్, శోభా ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ కు.. సోదరి కవిత ఆయన నుదుట తిలక దిద్ది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ బయల్దేరారు.
హరీష్ రావు సహా.. పార్టీలోని కింది స్థాయి నుంచి చివరి వరకూ పార్టీ నేతలంతా.. ఈ కార్యక్రమానికి హాజరు వేయించుకున్నారు. పార్టీలో కేటీఆర్ నియామకం పట్ల ఒక్క శాతం అసంతృప్తి కూడా లేదని నిరూపించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నాయి. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ప్రముఖ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ బాధ్యత స్వీకరణ సందర్భంగా… తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో బంజాహిల్స్ రోడ్లు కిక్కిరిసిపోయాయి.