హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ రాజధాని అమరావతి నిర్మాణానికే కేంద్రంనుంచి నిధులు తెచ్చుకోలేకపోయారని, ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాద్‌కు ఏమి నిధులు తీసుకొస్తాడని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ ఫీనిక్స్ క్లబ్లో ఐటీ ఉద్యోగిసంఘాల ప్రతినిధులతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు. లోకేష్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తానని అంటున్నాడని, అయితే చంద్రబాబే అమరావతికి కేంద్రంనుంచి పైసా తెచ్చుకోలేని అసమర్థుడని అన్నారు. చంద్రబాబు వల్ల మాత్రమే ఐటీ కంపెనీలు రాలేదని, హైదరాబాద్‌లో ఉన్న మంచి పరిస్థితులవల్లే వచ్చాయని చెప్పారు. ఇది స్టేట్ ఫైట్ కాదు, స్ట్రీట్ ఫైట్ అన్నారు. టీడీపీ-బీజేపీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని అన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానని చంద్రబాబు అంటున్నారని, అది మంచిది కాదని చెప్పారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఇంటర్నెట్ కనిపెట్టింది కూడా తానేనని చెబుతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐఫా ఉత్సవం వెనక తెలంగాణ ప్రభుత్వ కృషి ఉందని అన్నారు. హైదరాబాద్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారబోతోందని చెప్పారు. అమెరికాన్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయని, సిలికాన్ వ్యాలీలో కూడా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, విద్యావంతులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం మంచిది కాదని చెప్పారు.