కడవంత గుమ్మడి కాయ కూడా కత్తిపీటకు లోకువే అన్నట్లు దేశాన్ని విమానంలో కూర్చొని ఏలుతున్న ప్రధాని నరేంద్ర మోడి అంటే కొత్తగా రాజకీయాలలోకి వచ్చీరాగానే బీహార్ ఉపముఖ్యమంత్రి కూడా అయిపోయిన తేజస్వి ప్రసాద్ కూడా లోకువయిపోయారు. ఆయన తన బట్టలు ఉతికించుకోనేందుకే అపుడప్పుడు భారత్ వస్తుంటారని ఎద్దేవా చేసారు. కాదు..కాదు..తన కుర్చీకి ఎవరు ఎసరు పెట్టకుండా చూసుకోవడానికే అపుడప్పుడు ఇండియా వస్తుంటారని ప్రతిపక్షాలు జోకులు వేసుకొంటున్నాయి.
తెలంగాణా ఐటి మరియు పంచాయితీరాజ్ మంత్రి కె. తారక రామారావు కూడా మోడీ విదేశీ యాత్రల గురించి చిన్న పంచ్ డైలాగ్ కొట్టారు. “ఆయనకీ ఎప్పుడూ విదేశాలలో తిరగడానికే సరిపోతుంది. ఇక కొత్తగా ఏర్పడిన మా తెలంగాణా రాష్ట్రానికి టైం ఎక్కడుంది? తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు గడిచిపోయాయి కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణా రావలనుకోలేదు. ఆయనకి తెలంగాణా రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవడానికి ఇది చాలు,” అని అన్నారు.
మోడీ తెలంగాణా రాష్ట్రానికి రాకపోవడం, విదేశాలలో యాత్రలు చేస్తుండటం నూటికి నూరుపాళ్ళు నిజమే. కానీ మోడీ దేశంలో ఏ రాష్ట్రాలను పర్యటించడం లేదనే మాట మాత్రం వాస్తవం కాదు. ఆయన ఎన్నికలు జరిగే రాష్ట్రాన్ని ఆరు నెలల ముందు నుంచి ఎప్పుడూ పర్యటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణాలో ప్రస్తుతం జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు తప్ప పెద్ద ఎన్నికలు ఏవీ లేవు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకి కూడా ఆయన వచ్చి ప్రచారం చేయవలసిన అవసరం లేదు కనుక ప్రస్తుతం విదేశాలను చుట్టబెట్టేస్తున్నారు. మధ్యలో వీలయితే కేసీఆర్ చేస్తున్న ఆయుత చండీ యాగానికి వస్తారేమో వేచి చూడకుండా కె. తారక రామారావు తొందరపడటం ఎందుకు? ఒకవేళ రాకపోయినా 2019లో ఎన్నికల ప్రచారానికి తప్పకుండా వస్తారని గ్యారంటీగా చెప్పవచ్చును.