తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వస్తుందంటే.. దూసుకొచ్చే సందడి అంతా ఇంతా కాదు. చిన్నసార్ను ఇంప్రెస్ చేయడానికి పార్టీ నేతలు రకరకాల స్కిట్లు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా కేటీఆర్ బర్త్‌డే వచ్చేసింది. జూలై 24న కేటీఆర్ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా… విపరీతమైన కార్యక్రమాలు నిర్వహించి.. పార్టీ శ్రేణులు డబ్బులు వృధా చేస్తున్నాయని గత ఏడాది అనుకున్న కేటీఆర్… వాటిని సేవా కార్యక్రమాలకు మళ్లించాలని అనుకున్నారు. తన వంతుగా ఆరు అంబులెన్స్‌లను విరాళం ఇస్తున్నానని..మీరు కూడా ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. దీంతో సౌండ్ పార్టీలుగా పేరు పడ్డ టీఆర్ఎస్ నేతలంతా… తమ తమ అంబులెన్స్ విరాళాలను ప్రకటించారు.
దాదాపుగా వంద అంబులెన్స్‌లు వస్తాయని చెప్పుకున్నారు. మంత్రి మల్లారెడ్డి లాంటి కొంత మంది తమ విరాళ ప్రకటనల్ని మెటీరియలైజ్ చేసి.. అంబులెన్స్‌లు ఇచ్చారు. చాలా మంది మంది మాత్రం… ప్రకటనలు చేశారు కానీ ఇవ్వలేకపోయారు. ప్రకటించినట్లుగా వంద అంబులెన్స్‌లు రాలేదు కానీ.. కొన్ని అయితే… ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఈ సారి కేటీఆర్ ట్రై సైకిళ్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే సైకిళ్లు కాదు.. ట్రై స్కూటర్లను వికలాంగులకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన వంతుగా వంద స్కూటర్లను పంపిణీ చేస్తానని.. మీరు కూడా చేయాలని పార్టీ నేతలకు సందేశం ఇచ్చారు.
ఆయన అలా సందేశం ఇవ్వడమే ఆలస్యం. స్పందించడానికి మంత్రులు.. ఇతర నేతలు సిద్ధంగా ఉంటారు. వారు కూడా రెడీ అయ్యారు. ప్రకటించిన అందరూ ఇవ్వకపోవచ్చు కానీ సగం మందైనా… తమ విరాళాన్ని అందిస్తే.. చాలా మంది వికలాంగులకు ట్రైస్కూటర్లు లభిస్తాయి. కేటీఆర్ ఓ రకంగా.. తాను సేవ చేస్తూ.. పార్టీ నేతలను కూడా ఆ దిశగా నడిపిస్తున్నారు. ఫ్లెక్సీలకు.. ప్రకటనలకు పెట్టేఖర్చును ఇలా మంచి పనులకు మళ్లించే ప్రయత్నం చేయడం.. చాలా మందిని ఆకట్టుకుంటోంది.