కొలువుల కొట్లాట సభలో కేసీఆర్ సర్కారును జేయేసీ ఛైర్మన్ కోదండరామ్ ఎండగట్టారు. ‘మేము ఏమడిగినం, మడులు అడిగినమా, మాన్యాలు అడిగినమా? మీ కుర్చీలు అడిగినమా, మంత్రి పదవులు అడిగినమా? మా ఉద్యోగాలు మాకు కావాలి. మా కొలువులు మాకు కావాలని అడిగినం’ అంటూ కోదండరామ్ సర్కారును నిలదీశారు. ఏ నినాదం కోసమైతే గతంలో తెలంగాణ ఉద్యమంలో చేశామో, దాన్ని సాధించుకోవడం కోసం మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు అయిందన్నారు. రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కొలువుల గురించి ఆలోచిస్తుందనుకున్నామనీ, కానీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం అంటోందనీ, ఇంకెందుకు కొట్లాటలు అని ఇప్పుడు చెబుతోందనీ, కానీ.. కేలండర్ విడుదల చేసే వరకూ నమ్మకం కుదరదని ప్రభుత్వానికి కోదండరామ్ స్పష్టం చేశారు.
కొలువుల కొట్లాట సభ డిమాండ్ ఇదీ. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన ఉంటే ఏముండాలీ… ఖాళీల భర్తీ గురించో, త్వరలోనే రాబోతున్న నోటిఫికేషన్ల గురించో మాట్లాడాలి కదా! కానీ, ఈ అంశానికి కూడా అధికార పార్టీ రాజకీయ రంగు పూసేసి… అసలు విషయంపై మాట్లాడుకుండా కొసరు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. కొలువుల కొట్లాట విషయాన్ని వదిలేసి, పదవుల కొట్లాటను తెరమీదకి ప్రముఖంగా తెచ్చే ప్రయత్నం చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలపై విమర్శలకు ఈ సందర్భాన్ని వాడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేనోళ్లూ, తాము తెలంగాణ వాదులం కాదనీ, సమైక్య వాదులమూ కాదనీ, జాతీయ వాదులమని చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు ఇవాళ్ల మమ్మల్ని విమర్శించడమేంటన్నారు. కొలువుల కోసం కోట్లాట వాస్తవమేననీ, పోయిన జైపాల్ రెడ్డి ఉద్యోగం కోసం, పోయిన జానారెడ్డి ఉద్యోగం కోసం, పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి కోసం… వీటి కోసమే తప్ప, కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఎక్కడుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్నారనీ, ఆ కాలంలో ఎన్నివేల మందికి ఉద్యోగాలు ఇచ్చారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
మొత్తానికి, ఉద్యోగాల గురించి మాట్లాడకుండా రాజకీయాల వైపు చర్చను మంత్రి కేటీఆర్ డైవర్ట్ చేశారనే చెప్పాలి. ఉద్యోగాల కోసం సభ పెడితే.. దీన్ని కాంగ్రెస్, తెరాసల మధ్య విమర్శలూ ప్రతివిమర్శలకూ వేదికగా మార్చేశారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. ప్రొఫెసర్ కోదండరామ్ అడిగిన ప్రశ్నలకు, ఆయన చేసిన డిమాండ్లకు అధికార పార్టీ నుంచి స్పష్టమైన స్పందన కనిపించలేదు. మొత్తంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలకే కేటీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. అసలు విషయాన్ని చాలా జాగ్రత్తగా పక్కతోవ పట్టించారని అనుకోవచ్చు. ఇంకేముంది… ఈ రాజకీయ కొలువుల కొట్లాట అంశంపై మళ్లీ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తారు, తెరాస కూడా కౌంటర్ ఇస్తుంది, అంతే!