ఎలాగైనా పార్టీని బ్రతికించుకోవాలంటే… అధికారం అండగా ఉండాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయిపోయినట్లుంది. వరుసగా ఎమ్మెల్యేలు చేజారుతుండటం, కిందిస్థాయి క్యాడర్ పార్టీ నుండి వెళ్లిపోతున్న నేపథ్యంలో… త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇందులో పార్టీ గెలిచే అవకాశాలు లేవు. అదే జరిగితే సీనియర్ నాయకుల మనోధైర్యం కూడా దెబ్బతిని, పార్టీ మనుగడకే ప్రమాదమని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీతో పొత్తు ఉంటే నాయకుల వలసలు ఆగటమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కేసుల బాధ ఉండదన్న ఉద్దేశంతో… బీజేపీతో సయోధ్యకు కేటీఆర్-హరీష్ లు ప్రయత్నించారని, ఇటీవల జరిగిన ఢిల్లీ టూర్ ప్రధాన ఉద్దేశం అదేనని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
అయితే, బీఆర్ఎస్ ను బీజేపీ నమ్మేలా లేదని… ఆశించిన స్థాయిలో అటు నుండి సానుకూల స్పందన రాకపోగా, కొందరు బీజేపీ నేతలు పొత్తులు అవసరమా… సొంతగా ఎదిగే అవకాశం ఉండగా, బీఆర్ఎస్ ను ఎందుకు మోయటం అన్న అభిప్రాయంతో నో చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో… కేటీఆర్-హరీష్ రావులు వెనుదిరిగారని ఆ కథనం సారాంశం.
కానీ, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాల్సి వస్తే… బీఆర్ఎస్ తో బీజేపీ కలిసిరాక తప్పదని, బీజేపీకి గ్రౌండ్ లో అంతగా క్యాడర్ లేదన్న విషయం కూడా మరువరాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.