ఉద్యమపార్టీగా ప్రారంభమై… తెలంగాణ సాధనలో సక్సెస్ అయిన టీఆర్ఎస్.. ఇప్పుడు పూర్తి రాజకీయ పార్టీగా అవతరించింది. వరుసగా రెండో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకూ.. పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే.. టీఆర్ఎస్ నడిచింది. అది ఉద్యమం అయినా… ప్రభుత్వం అయినా… ఏ టూ జడ్ కేసీఆరే. కానీ.. ఈ రోజు నుంచి.. టీఆర్ఎస్ యువ నాయకత్వం చేతుల్లోకి వెళ్తోంది. కేటీఆర్… వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో ఇక కేటీఆరే చూసుకోబోతున్నారు. అంటే.. ఇక కేసీఆర్ ఏ మాత్రం కలగజేసుకోరు. ఇక తప్పదు అనుకుంటే.. తప్ప.. వ్యవహారాలను మొత్తం కేటీఆరే చక్క బెడతారు.
ఆరు నెలల్లో పార్టీపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో తనపై సంపూర్ణ నమ్మకం కలిగించేలా… తన నాయకత్వంపై వారికి పూర్తి విశ్వాసం కలిగేలా… ఆయన కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. కేసీఆర్ అనే శిఖరం ఎదురుగా ఉండగా.. ఆయన తన బాధ్యతల్ని… అంతకు మించి ప్రతిభావంతంగా చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఏ చిన్న సమస్య వచ్చినా.. పరిష్కార విధానంలో ..అందరూ కేసీఆర్‌తో పోలుస్తారు. టీఆర్ఎస్ విజయోత్సాహంతో ఉంది కాబట్టి… శ్రేణులన్నీ… ఇప్పటికి… కేటీఆర్‌ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాయి. గడ్డు పరిస్థితులు వచ్చినప్పటికీ.. వారంతా తన వైపే ఉండేలా చూసుకోవడంలోనే.. కేటీఆర్ నాయకత్వ పటిమ ఆధారపడి ఉంది.
పార్టీ మొత్తం ఏకతాటిగా.. కేటీఆర్ నాయకత్వాన్ని ఆమోదిస్తుందని చెప్పేందుకు… వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానాలు లేకపోయినప్పటికీ… వీలైనంత మంది.. అన్ని రాకల పదవుల్లో ఉన్న వారు కార్యక్రమానికి వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత భారీగా కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలను తలసాని, దానం నాగేందర్ తీసుకున్నారు.