హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా విస్తరిస్తామని, పార్టీ పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని, భీమవరంలో పోటీ చేస్తానని మంత్రి కేటీఆర్ మొన్న కూకట్‌పల్లిలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నాయకులు కేటీఆర్‌ను ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనితో కేటీఆర్ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అమరావతి శంకుస్థాపన బహిరంగసభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే కేసీఆర్‌కు ఎక్కువ కరతాళధ్వనులు లభించాయని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు తనతో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్ర సమితి వ్యాఖ్యలను చేశానని కేటీఆర్ చెప్పారు. దానిని చిలవలు పలవలు చేయటం సరికాదని, రాజకీయాల్లో మరీ ఇంత సీరియస్‌గా ఉంటే కష్టమని అన్నారు. ఐటీ మంత్రిగా ఆ రంగంతో తనకున్న అనుబంధం, స్థానికంగా తనకున్న పరిచయాల కారణంగా గ్రేటర్ ఎన్నికల ప్రచార బాధ్యతలను తనకు అప్పగించారని చెప్పారు. తనకు ఏ పని అప్పగించినా కార్యకర్తగా దానిని నిర్వర్తించటం తన బాధ్యతన అన్నారు. మంత్రి హరీష్ రావుతో పంచాయతీ పెట్టుకునేంత సమయంగానీ, అవసరంగానీ తనకు లేవని చెప్పారు. తమకిద్దరికీ 24 గంటలు కష్టపడి పనిచేసినా సరిపోనంత పని ఉందని అన్నారు. తామిద్దరమూ కష్టపడుతున్నామని, ఇద్దరికీ ప్రజల మద్దతుందని చెప్పారు.