తెలంగాణలో బతుకమ్మ కానుక వివాదం రాజుకుంటోంది. రాష్ట్ర ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం చీరలు కానుక ఇవ్వాలనుకుంది. కొన్ని చోట్ల పంపిణీ కూడా మొదలుపెట్టింది. ఆ చీరల నాణ్యత నాసిరకంగా ఉన్నాయంటూ చాలా చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక, ప్రతిపక్షాలు రంగంలోకి దిగేశాయి. ప్రతీ స్కీము వెనకా ఒక స్కాము ఉండేలా కేసీఆర్ సర్కారు నిర్ణయాలు ఉంటాయంటూ రేవంత్ రెడ్డి విమర్శలకు దిగారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఆయన కుటుంబానికి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకొచ్చే విధంగా ఉంటాయంటూ ఆయన మండిపడ్డారు. భాజపా నేత కిషన్ రెడ్డి కూడా విమర్శలు చేశారు. అయితే, వీటిని కవర్ చేసుకుంటూ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మొత్తం గొడవకు కారణం కాంగ్రెస్ పార్టీ అని చిత్రించే ప్రయత్నం చేయడం విశేషం!
ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా, దాన్ని ఏదో ఒక రకంగా బద్నామ్ చేయడం కోసం ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటున్నాయని మంత్రి ఆరోపించారు. దిగజారుడు, చౌకబారు, నీచ నికృష్ట కుటిల రాజకీయాలను తాను ఇప్పుడే చూస్తున్నాను అన్నారు. బతుకమ్మ అనేది ఒక సెంటిమెంట్ అనీ, తెలంగాణ ఆడపడుచులు ధనికా పేదా అని తేడా లేకుండా బతుకమ్మలు ఆడతారనీ, ఆ పువ్వుల్ని కూడా ఎక్కడా కిందన పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారనీ మంత్రి చెప్పారు. ఈ పండుగ సందర్భంగా చీరలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే కృత్రిమమైన నిరసనలకు శ్రీకారం చుట్టారన్నారు. ఒక నాలుగు లేదా ఐదు చోట్ల ఈ ఘటనలు జరిగాయనీ, వాటిని కూడా జాగ్రత్తగా చూస్తే మూడు చోట్ల జగిత్యాల నియోజక వర్గంలో జరిగాయనీ, అది కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి నియోజక వర్గమని కేటీఆర్ చెప్పారు. మరో ఘటన సత్తుపల్లిలో జరిగిందన్నారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులకు కోటిమందికి చీరలు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా చేశారా అంటూ ప్రశ్నించారు. చీరలు నచ్చకపోతే వాటిని పక్కనపడేస్తరు, పని మనుషులకు ఇచ్చేస్తారుగానీ ఇలా గతలబెట్టరని అన్నారు. కొంతమంది కావాలనే మహిళల దగ్గర చీరలు గుంజుకుని తగులబెట్టారనీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులే దగ్గరుండి తగలబెట్టించారన్నారు.
ఏతావాతా ఆయన తేల్చింది ఏంటంటే.. ఇవి కృత్రిమ నిరసనలు, కాంగ్రెస్ ప్రేరిత కార్యక్రమాలు అని! తప్పులుంటే, లోటుపాట్లు ఉంటే వాటిని విశ్లేషించుకుంటామని చెబుతూనే… ఈ తప్పులకు కారణం కాంగ్రెస్ అని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇంతకీ ఈ చీరల పంపిణీలో నాణ్యతా లోపాలను ప్రభుత్వం గుర్తించిందా లేదా..? సూరత్ నుంచి చీరలు తెప్పించారా లేదా..? హుటాహుటిన టెండర్లు పిలిచి, కాంట్రాక్టు కట్టబెట్టారా లేదా.. అనే ప్రశ్నలకు మాత్రం మంత్రి దగ్గర నుంచీ సమాధానం రాలేదు. వచ్చిందల్లా ఒక్కటే.. బతుకమ్మ అనేది సెంటిమెంట్స్ తో కూడుకున్న పండుగ అనీ, దానిపై కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయనీ, ముఖ్యమంత్రి ఏం చేసినా పెద్దగా గొప్పగా ఆలోచిస్తారని చెప్పారు! కేసీఆర్ ఆలోచన చిన్నదా పెద్దదా కాదనేది కాదు కదా చర్చ! ఇచ్చిన చీరల్లో నాణ్యతా లోపాలున్నాయా లేదా అనేది మాట్లాడాలి. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం ఇదంతా ప్రతిపక్షాల రాజకీయంగానే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.