కొండా సురేఖపై కోర్టుకు వెళ్లాలని కేటీఆర్ కూడా నిర్ణయించుకున్నారు. ఆ మంత్రిని వదలబోనని ఆయన తాజాగా ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు.. తప్పుడు ఆరోపణల చేసి కుటుంబాన్ని మనస్తాపానికి గురి చేశారని.. తన పరువుకు భంగం కలిగించారని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖపై నాగార్జున రెండు పిటిషన్ల వేశారు. ఒకదాంట్లో రూ. వంద కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
రాజకీయంగా చేసే విమర్శలకు కోర్టులు పరువు నష్టం అంశాలపై ఎలా స్పందిస్తాయో చెప్పడం కష్టం. విచారణలు చాలా ఆలస్యమవుతూ ఉంటాయి. వైసీపీ నేతలు కొండా సురేఖ కంటే దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ నేతలపై చేసేవారు. చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసేవారు. దీంతో నారా లోకేష్ పలువురిపై పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో పోసాని, పోతుల సునీత సహా చాలా మంది ఉన్నారు. ఆయన పిటిషన్లు వేసి కోర్టుకు వెళ్లి వాంగ్మూలాలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ కోర్టులు నోటీసులు జారీ చేయడం కానీ.. కేసులు నమోదు చేయాలని ఆదేశించడం కానీ చేయలేదు.
చాలా ఆలస్యంగా ఈ కేసులు నడుస్తూంటాయని లాయర్లు చెబుతూంటారు. ఎంత కాలం నడిచినా తాము సిద్ధమని నాగార్జున చెప్పారు. కేటీఆర్ కూడా ఆ మంత్రిని వదిలేది లేదని అంటున్నారు. రేపు ఎప్పుడైనా కొండా దంపతులు.. బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధపడితే ఇవన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. విజయమ్మ, వైఎస్ పై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన బొత్స లాంటి వాళ్లను జగన్ పార్టీలో చేర్చుకని పదవులు ఇవ్వడమే కాకుండా తండ్రి లాంటి వాడని చెప్పుకున్నారు. తెలంగాణలో సైతం అలా జరగకూడదని ఏమీ లేదుగా !