తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్రంపై తన దూకుడు మరింత పెంచారు. గురువారం నాడు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలకు మించి దాదాపు వ్యక్తిగత దాడే చేసిన మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముంబాయ్ లో జరుగుతున్న నాస్కామ్ సాంకేతిక నాయకత్వ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆ సదస్సులో మాట్లాడుతూ రాష్ట్ర్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. “కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదు. ఏ అంశంలోనూ మాకు మద్దతు ఇవ్వడం లేదు” అని నాస్కామ్ వేదికపై నుంచి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలని, అలా చేస్తేనే రాష్ట్రాలు అభివ్రద్ధి చెందుతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. “కేంద్రం రాష్ట్రాలు తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోంది. దీని వల్ల దేశం ఏ రంగంలోనూ అభివ్రద్ధి చెందదు” అని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్ర్రంలోనూ కూడా ఉమ్మడిగా ఉన్న అనేక అంశాలను రాష్ట్రాలకు బదలాయించాలని, దీని వల్ల రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ వస్తుందని అన్నారు. పాలనలో ఎంతో కీలకమైన సేవారంగం, విద్య, పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ వంటి కీలక అంశాలను రాష్ట్రాలకే అప్పగించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
“గడచిన రెండు, మూడు సంవత్సరాలుగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ప్రజలు కోరుకున్న రీతిలో కేంద్రం పని చేయడం లేదు. ఇది చాలా నిరాశ పరుస్తోంది” అని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి ఏం రంగానికి నిధులు వెచ్చిస్తే దేశం త్వరితగతిన అభివ్రద్ధి చెందుతుందో తెలియడం లేదని, మౌలిక వసతుల కల్పనపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ సంస్థలకు కేంద్రం విధిస్తున్న నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని, వీటి కారణంగా అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణాలో గత ప్రభుత్వాల కంటే తాము ఎన్నో నిధులు వెచ్చించి అభివ్రద్ధి చేస్తున్నామని, తాము అధికారంలో రాక ముందు అప్పటి ప్రభుత్వాలు కేవలం 50 వేల కోట్లు ఖర్చు చేసాయని, 2014 తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 60 వేల కోట్లు వెచ్చించి పలు అభివ్రద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. వరంగల్ లో జౌళి పార్కును ఏర్పాటు చేశామని, దీనికి జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ఐటీ పరశ్రమలను పెద్ద నగరాలకే పరిమితం చేయకూడదని, వాటి పట్టణాలకు చేరువ చేస్తే త్వరితగతిన అభివ్రద్ధి చెందవచ్చునని ఆయన చెప్నారు. అయితే అన్ని విషయాలలోనూ కేంద్రం మెకాలడ్డు వేయాలని భావిస్తోందని, ఇది రాష్ట్రాల ప్రగతికి, అంతిమంగా దేశ ప్రగతికి మంచిది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలు ఐటీ కంపెనీలకు చెందిన దిగ్గజాలు పాల్గొన్నారు.