ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్ దేశంలో అనేక పాలసీలు మారినట్లు గుర్తు చేశారు.
అదాని కోసం బొగ్గు పాలసీ, విమానయాన పాలసీ మార్చింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించిన కేటీఆర్ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నారు. రెండేళ్లుగా ఢిల్లీ మద్యం పాలసీపై విచారణ జరుపుతున్నా ఒక్క రూపాయి అయిన దర్యాప్తు సంస్థలు రికవరీ చేశాయా..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఊహాజనిత కథలతో అల్లిన స్టోరే ఎక్సైజ్ పాలసీ కేసు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నచోట బీజేపీ మనుగడ కష్టమని భావించే కుట్రపూరితంగా ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ఆరోపించారు.
పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరగానే వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న కేటీఆర్ దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. తమకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని తప్పకుండా న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.