నిజానికి కేటీఆర్‌కు సంబంధించినంత వరకు ఆయన ప్రస్తుత కార్యక్షేత్రం గ్రేటర్ ఎన్నికల బరి మాత్రమే. అయితే యావత్తు దేశం బాగోగుల గురించి ఆయన తక్షణం విచారించవలసిన అగత్యమేమీ లేదు. అయితే కాంగ్రెస్ మీద ఆయనలో ఆస్థాయి ఆగ్రహం పెల్లుబికి వచ్చిందేమో గానీ.. ఆ పార్టీ మీద చెడామడా నిప్పులు కురిపించారు. గ్రేటర్ ప్రచారం మొత్తాన్నీ తన భుజానికెత్తుకుని అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి కేటీఆర్ తమ ప్రత్యర్థుల్లో తెదేపా కంటె ఎక్కువ కాంగ్రెసు మీదనే ఫోకస్ పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత పాలకవర్గంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తామే గ్రేటర్ లో బలమైన పార్టీ అని ఫీలవుతున్న నేపథ్యంలో వారిని విమర్శించడంపై కేటీఆర్ దృష్టిపెడుతున్నారు.
ఆంధ్రా ప్రాంతపు సెటిలర్ల ఓట్లు గ్రేటర్ ఎన్నికల్లో కీలకం కానున్న నేపథ్యంలో సెటిలర్లను ఆకట్టుకోవడానికి తెరాస నేతలు కూడా నానా పాట్లు పడుతున్న సంగతి అందరూ గమనిస్తున్నారు. కేటీఆర్, కేసీఆర్ అంతా సెటిలర్ల అనుకూల ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సెటిలర్లలో తెరాస పట్ల భయాందోళనలు రేకెత్తించడానికి ఇంకా పెద్ద అనుమానాలు నాటడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే వారికి కోపం రావడం సహజం కదా. అందుకే కాబోలు.. కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్లకు రక్షణ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందనే కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై ఆయన కన్నెర్ర చేశారు. వారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. ”ఎవరు ఎవరికి రక్షణ కల్పిస్తారు? ఎవరినుంచి రక్షణ కల్పిస్తారు? ఆ మాటకొస్తే.. ఈ దేశానికి కాంగ్రెస్‌నుంచి రక్షణ అవసరం… ఆ పార్టీ ఈ దేశంనుంచి ఎప్పుడు పోతే అప్పుడు దేశానికి పట్టిన దరిద్రం పోతుంది.” అంటూ కేటీఆర్ ఆగ్రహించడం విశేషం.
ప్రస్తుతం కేటీఆర్ అంటున్న ఈ డైలాగు.. ‘కాంగ్రెస్ పార్టీని దేశంనుంచి వెళ్లగొడితేనే ఈ దేశానికి పట్టిన దరిద్రం పోతుందన్నది’ ఇంచుమించుగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ అన్న డైలాగులాగానే ఉండడం గమనార్హం. మోడీ కూడా కాంగ్రెస్ హఠావ్.. దేశ్ కో బచావ్ నినాదంతోనే ఎన్నికల్లో తలపడ్డారు. ఇప్పుడు కేటీఆర్ కూడా మోడీ బాటలోనే కాంగ్రెస్ మీద విరుచుకు పడడం యాదృచ్చికమే కావచ్చు.