ఫార్ములా రేసు కేసులో కేటీఆర్కు పది రోజుల పాటు ఊరట లభించింది. ఎప్పుడెప్పుడు అరెస్టు చేస్తారా అనే టెన్షన్ లేకుండా పది రోజుల పాటు ఉండవచ్చు. తనపై నమోదైన కేసు విషయంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. వెంటనే విచారణ జరిగింది. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి కేటీఆర్ ను పది రోజుల పాటు అరెస్టు చేయవద్దని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి కేసు విచారణను 27వ తేదీకి వాయిదా వేశారు.
హైకోర్టులో కేటీఆర్ తరపున సుప్రీకోర్టు లాయర్ సుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్ డబ్బులు అందినట్లుగా చెప్పలేదని ఈ కేసు చెల్లదని వాదించారు. ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరిగాయన్నారు. ఇందులో అసలు కేటీఆర్ ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదు వచ్చిన తర్వాత రోజే కేసు పెట్టారని ప్రాథమిక దర్యాప్తు కూడా చేయలేదన్నారు.
ప్రభుత్వం తరపున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాథమిక దర్యాప్తు ఎప్పుడో పూర్తయిందని.. కేటీఆర్ ప్రజాప్రతినిది కాబట్టి గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నామన్నారు. ఆ పత్రాలను న్యాయమూర్తి క సమర్పించారు. ఎఫ్ఐఆర్ ప్రకారమే దర్యాప్తు జరుగుతోందని.. డబ్బులు తరలించే నాటికి అసలు ఒప్పందమే లేదన్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఒప్పందం చేసుకున్నారని వాదించారు. క్వాష్ పిటిషన్ అత్యవసర విచారణ కాదని.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కౌంటర్ దాఖలు చేసేందుకు 30వ తేదీ వరకూ హైకోర్టు సమయం ఇచ్చింది. అప్పటి వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేటీఆర్ ను అరెస్టు చేయాలని ప్రభుత్వం కూడా అనుకోవడం లేదు.. అరెస్టు వల్ల కేటీఆర్ ఏమైనా రాజకీయ లబ్ది జరిగితే..దాన్ని దక్కకుండా చేయాలని అనుకుంటోందని అందుకే కేటీఆర్ విషయంలో కోర్టులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.