ఫార్ములా ఈ రేసు కంపెనీకి డబ్బులు తరలించడాన్ని ఈడీ చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. FEO కంపెనీ కార్యాలయం లండన్ లో ఉంటుంది. అక్కడి బ్యాంక్ ఖాతాకు తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి నిధులు జమ అయ్యాయి. ఇది అక్రమ తరలింపు అని ఆర్బీఐ నిర్దారించి రూ. ఎనిమిది కోట్లు ఫైన్ వేసింది. అసలు వ్యవహారంలో ఇదే కీలకం. ఆ డబ్బులు ఇంకెక్కడికైనా రూటింగ్ చేశారా అన్నది ఈడీ తేల్చేందుకు ప్రయత్నిస్తోంది
LR జారీ చేయబోతున్న ఈడీ
తెలంగాణ ప్రభుత్వ నిధులు ప్రైవేటు కంపెనీ ఖాతాలో నిబంధనలకు విరుద్దంగా జమ అయిన కేసులో లెటర్ ఆఫ్ రెగొటరీ .. ఎల్‌ఆర్‌ను జారీ చేయాలని ఈడీ నిర్ణయించుకుంది. అంటే ఈ కేసులో లండన్ వ్యవస్థల సాయం కోసం ఈడీ లేఖ పంపుతోందన్నమాట. కొద్ది సమాచారం తెలుసుకుంటే చాలు ఈడీకి పని చాలా సులువు అవుతుంది. FEO కంపెనీ ఖాతాలో జమ అయిన ఇండియన్ కరెన్సీని ఆ కంపెనీ ఎటు వైపు మళ్లించింది అన్న సమాచారం తెలుసుకోబోతున్నారు. ఇదే కేసు దర్యాప్తులో అత్యంత కీలకం.
FEO కంపెనీ నిధులు మళ్లించి ఉంటే తీవ్ర నేరం
తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు అందుకున్న ఎఫ్ఈవో కంపెనీ ఆ నిధుల్ని ఫార్ములా ఈ రేసు కోసం వినియోగించలేదు. ఎందుకంటే ఆ రేసు జరగలేదు. ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఆ నిధుల్ని ఏం చేసింది?. వేరే కంపెనీలకు మళ్లించి ఉంటుందని భావిస్తున్నారు. ఆ కంపెనీల్లో బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉన్న ఏ కంపెనీ ఉన్నా అది కేటీఆర్ కు పెను సమస్యగా మారనుంది. నిధులు దారి మళ్లాయని అవి ఎవరికి చేరాయో తేలుస్తామని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ ఏసీబీ పరిధి ఇంటర్నేషనల్ వరకూ లేదు. కానీ ఈడీకి ఉంది. వారు సేకరించే సమాచారం ఏసీబీకి పెద్ద ఆయుధంగా మారుతుందనడంలో సందేహం లేదు.
కేటీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం ఉందని చెప్పారన్న రేవంత్ రెడ్డి
కేసు నమోదు అయిన రోజున కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. FEO చైర్మన్ రేవంత్ ను కూడా కలిశారని ఫోటోలు రిలీజ్ చేశారు. ఆ అంశంపై రేవంత్ స్పందించారు. అసెంబ్లీలోనే చెప్పారు. ఆయన తనను కలిసినప్పుడే అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు. తమకు కేటీఆర్ తో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని మీరు కూడా సహకరించాలని కోరినట్లుగా రేవంత్ చెప్పారు. అప్పుడే లొసుగుల్ని గుర్తించి క్యాన్సిల్ చేశానన్నారు. రేవంత్ చెప్పింది నిజమే అయితే.. కేటీఆర్ కు అనేక సమస్యలు చుట్టుముట్టడం ఖాయంగా కనిపిస్తోంది.