బీఆర్ఎస్ కీలక నేతలిద్దరూ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావులు గురువారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కేటీఆర్, హరీష్ రావులు కవితతో ములాఖత్ అయ్యారు.
నిజానికి మొన్నీమధ్యే హరీష్ రావు కవితను కలిశారు. వారం కూడా అయ్యిందో లేదో ఇప్పుడు హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. అది కూడా కేటీఆర్ తో కలిసి ములాఖత్ లో మరోసారి కవితను కలిశారు. కేటీఆర్ కూడా గ్రేటర్ హైదరాబాద్ మీటింగ్ ను తలసానికి అప్పగించి మరీ వెళ్లారు.
దీనిపై బీఆర్ఎస్ వివరణ ఇస్తూ… కవిత బెయిల్ పిటీషన్ కోసం ఢిల్లీలో ఉన్నారని, సుప్రీంకోర్టు వేసవి సెలవులు ముగిసిన తర్వాత బెయిల్ పిటీషన్ వేస్తున్నామని, సోమవారం వేసే అవకాశం ఉన్నందున న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు సోమవారం వరకు ఢిల్లీలోనే ఉంటారని దాని సారాంశం.
ఈ ఇద్దరూ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని, బీజేపీ పెద్దలతో మీటింగ్ కోసం కేసీఆర్ వీరిద్దరినీ పంపారని… బీఆర్ఎస్-బీజేపీ ములాఖత్ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కవితను బయటకు తీసుకరావటం, కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీతో కలిసి పనిచేసే ఒప్పందాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆరోపణల తర్వాత బీఆర్ఎస్ వివరణ ఇవ్వటం ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సోమవారం బెయిల్ పిటీషన్ వేసినా… నాలుగైదు రోజులు అక్కడేం చేస్తారు? ఢిల్లీ లిక్కర్ కేసును ఎవరి తరఫున వాదించినా ముగ్గురు నలుగురు లాయర్లే వాదిస్తున్నారు… ఇక వారితో చర్చించేది ఏముంది… అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.