ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేటీఆర్ మరోసారి జోక్యం చేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు ఏపీ ఎన్నికల్లో మేము ఎందుకు జోక్యం చేసుకోకూడదు… రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలిగా అని ప్రకటించి మరీ వైసీపీకి మద్దతు తెలిపారు. అన్ని విధాలుగా సహకరించారు. దాదాపుగా మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. ఏపీ పేరు పెట్టకుండా ఏపీలో పరిస్థితుల్ని ఆయన క్రెడాయ్ మీటింగ్‌లో బయట పెట్టడంతో ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది.
ఏపీ రాజకీయ నాయకులు కేటీఆర్‌కు అనుకూలంగా.. వ్యతిరేకంగా మారిపోయారు. వైసీపీ నేతలు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ హైకమాండ్ మాత్రం కేటీఆర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని.. తమను కించపర్చినా తుడిచేసుకుంటామన్నట్లుగా మాట్లాడింది. కానీ కింది స్థాయి మంత్రులకు మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు.. ఘాటుగా స్పదించరా అని సందేశాలు పంపుతోంది. దీంతో మంత్రులు స్ట్రాటజీని అర్థం చేసుకోని రంగంలోకి దిగిపోతున్నారు. కేటీఆర్ అర్థరాత్రి ట్వీట్‌తో వివరణ ఇచ్చినప్పటికీ శనివారం కొంత మంది మంత్రులు, మాజీ మంత్రులు ఘాటు విమర్శలు చేశారు.
మరో వైపు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు వైసీపీ వ్యతిరేక పక్షాలకు చెందిన వారు కేటీఆర్ మాటల్లో తప్పు ఎక్కడ ఉందో చెప్పాలంటున్నారు. సీపీఐ సీనియర్ నేత నారాయణ అయితే స్వయంగా రోడ్ల పరిస్థితిని రిపోర్టింగ్ చేసి.. కేటీఆర్ మాటల్లో నిజం ఉందని సాక్ష్యాలు చూపించారు. ఇక వైసీపీలోనే రెబల్స్ గా ఉన్న రఘురామ, డీఎల్ రవీంద్రారెడ్డి వంటి వారు కూడా కేటీఆర్ మాటల్ని సమర్ధించారు. ఏపీలో మౌలిక సదుపాయాలు లేవనేది దేశం మొత్తం తెలిసిన విషయమన్నారు. ఏపీ పరిస్థితిని వీడియోల ద్వారా వివరిస్తున్నారు.
ఏపీ పరిస్థితిని పారిశ్రామికవేత్తలకు వివరించడం ద్వారా కేటీఆర్ హైదరాబాద్‌ను ప్రమోట్ చేసుకున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ ఆయన వ్యాఖ్యలు ఏపీలో పెట్టిన మంట మాత్రం రాజకీయం అయిపోతున్నాయి. ఇది ఆయన మిత్రపార్టీ వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. కేటీఆర్ ఏమైనా లోతైన రాజకీయంతో ఇలా మాట్లాడారా లేకపోతే ఆయనే చెప్పినట్లు అన్యాపదేశంగా అన్నారా అన్నది వైసీపీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు.