రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు వారు కలసి మెలసి వుండడం ఎక్కువమందికి సంతోషం కలిగిస్తున్నా కొంతమందికి మింగుడు పడడం లేదు. ఇప్పటికి ఆంధ్రా వారి ఆధిపత్యం అనే విమర్శ చుట్టూనే వారు పరిభ్రమిస్తుంటారు.అందులోనూ వ్యాపార వర్గాలలో ఈ విముఖత వుంది. విభజన తర్వాత కొన్ని వేలమంది ఉద్యోగులు మినహా వ్యాపార వేత్తలు సంపన్నులు ఎవరూ మకాం ఎత్తివేయలేదు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గొప్ప భవనం ఇక్కడే కట్టుకున్నారు. రియల్ రంగం ఇప్పటికీ హైదరాబాదులోనే కొనసాగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆఖరుకు ఆదాయం పెరుగుదల కూడా ఎపికి అరశాతం మించి లేదట. ఇందుకు తగినట్టే ఉద్యమ కాలంలో ఉద్రేకంగా మాట్లాడిన టిఆర్ఎస్ నాయకులు( ఇప్పుడు ప్రభుత్వాధినేతలు) ప్రస్తుతం పల్లవి మార్చి మాట్లాడుతున్నారు.అందులోనూ కెటిఆర్ అయితే మరింత స్నేహగీతాలాలపిస్తున్నారు. టిఆర్ఎస్ నాయకులలో ఒక భాగం దీనిపై చాలా కినుకగా వున్నారు. కెటిఆర్ వల్లనే ఇంకా ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతున్నదని వారి ఆరోపణ. ఆయనకు వారితోనే స్నేహాలు మంతనాలు అని ముఖ్యపదవిలో వున్న ఒక నాయకుడు ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రజల మధ్య ప్రభుత్వాల మధ్య స్నేహ సంబంధాలు మంచిదే గాని ఆ పేరిట స్వార్థపరులు వ్యాపారవర్గాలు రెండావుల దూడల్లా తయారయ్యే పరిస్థితిని నివారించాలని వారు వాపోతున్నారు. చెన్పై బెంగుళూరు ముంబై వంటి చోట్లనే ఇప్పటికీ తెలుగువారు ప్రముఖ పాత్ర వహించగా లేనిది తెలంగాణలో ఎపికి చెందిన వారి వ్యాపార వ్యవహారాలు ఆపేయడం కుదరని జరగదని వారు తెలసుకోవలసి వుంటుంది. ఆ మాటకొస్తే కెసిఆర్ రప్పించే స్వాములందరూ అక్కడి వారే కదా!