బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితుల్ని అంచనా వేయలేంతగా అంచనాల్లో మునిగి తేలుతున్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాదని పది నుంచి పన్నెండు సీట్లు వస్తే.. ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది తామేనని ఆయన అనుకుంటున్నారు. ఏదో ఇంటర్నల్ సమావేశాల్లో ఇలాంటి మాటలు చెబితే.. పార్టీ నేతలు నవ్వకుండా మ్యాటర్ సీరియస్ అని .. గుంభనంగా ఉండేవాళ్లేమో కానీ ఆయన నేరుగా కార్యకర్తల సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.
భువనగిరి ఎంపీగా క్యామ మల్లేష్ ను గెలిపించాలంటూ.. ఇబ్రహీపట్నంలో కార్యకర్తల భేటీ పెట్టి.. ఆయన తన ఆశలు.. ఆలోచనలను వివరించారు. . లోక్ సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని.. కేంద్రంలో అటు కాంగ్రెస్ కూటమికి.. ఇటు ఎన్డీఏ కూటమికి మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవన్నారు. అందుకే బీఆర్ఎస్, పది పన్నెండు సీట్లలో గెలిస్తే.. కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తానే ఎంపీ అభ్యర్థి అన్నట్లుగా పోరాడాలని సూచించారు.
బీఆర్ఎస్ కు ఒక్క సీటు అయినా వస్తుందా అని.. కాంగ్రెస్, బీజేపీ సవాల్ చేస్తున్నాయి. పార్టీ నేతలంతా వీడిపోయారు. టిక్కెట్ ఇచ్చినా వద్దని చెప్పి వెళ్లిపోతున్నారు. అభ్యర్థులుగాఖరారు చేసిన వాళ్లు సీరియస్ గా పోటీ చేస్తున్నారా లేదా అన్నసందేహాలు ఉ్ననాయి. ఇలాంటి సమయంలో కేటీఆర్ ఏకంగా పది , పన్నెండు సీట్లపై ఆశలు పెట్టుకోవడం ఆ పార్టీ నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది. కేటీఆర్ ఇంకా నేల మీదకు రాలేదని.. రియాలిటీ అర్థం చేసుకోలేకపోతున్నారని సెటైర్లు వేస్తున్నారు.