హైదరాబాద్ కి ఇదో చారిత్రక దినం అని చెప్పొచ్చు. ఒకే రోజున రెండు భారీ కార్యక్రమాలు జరిగాయి. దాదాపు పదేళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నగరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం, పైలాన్ ఆవిష్కరించి కాసేపు మెట్రోలో తిరగడం.. ఇదంతా చాలా హడావుడిగా సాగింది. ఇదే రోజున ఇంకోపక్క.. జీఈయస్ సమిట్ జరిగింది. అక్కడ ఇవాంకా ట్రంప్, ఇతర దేశాల ప్రతినిధులు.. అక్కడ కూడా చాలా హడావుడిగా సాగింది. ఇంత బిజీబిజీగా భారీగా జరిగిన ఈ కార్యక్రమాలను రాజకీయ కోణంలో కొంతమంది విశ్లేషిస్తున్నారు..! మొత్తంగా చూసుకుంటే మంత్రి కేటీఆర్ కు అత్యధిక ప్రాధాన్యత దక్కిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిజానికి, ఆయన మంత్రి అయిన దగ్గర నుంచీ మెట్రో పనులు సమీక్షిస్తున్నారు. ఇంకోపక్క ఐటీ శాఖకు మంత్రి. కాబట్టి, ప్రాధాన్యత అనేది సహజంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ, ఇదే సందర్భంలో ఇతరులకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ రామ్మోహన్ కనిపించలేదు. కారణలేంటో తెలీదుగానీ, దీంతో ఆయన కాస్త అసంతృప్తికి గురైనట్టు సోషల్ మీడియాలో రాసేస్తున్నారు. నగరంలో ఇంత భారీ కార్యక్రమం జరుగుతుంటే తెరాసలో కీలక మంత్రి అయిన హరీష్ రావు ఏమయ్యారనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి, ఆయన ఢిల్లీలో ఉన్నారట. కాళేశ్వరం అనుమతులకు సంబంధించిన పనుల నిమిత్తమై ఆయన ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే, ఆయన ఢిల్లీలో మిడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. అయినా, హైదరాబాద్ లో ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయని ముందే తెలుసు కదా! అలాంటప్పుడు, సరిగ్గా ఈ సందర్భంలోనే ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది కూడా పాయింటే కదా!
ఇక, జీఈఎస్ విషయానికొస్తే.. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలనేది ఈ సదస్సులో ప్రధానంగా కనిపించిన అంశం. ప్రధానిగానీ, ఇవాంకా గానీ మహిళల ప్రాధాన్యతను కొనియాడుతూ మాట్లాడారు. ఇలాంటి సదస్సులో ముఖ్యమంత్రి కుమార్తె కవిత ప్రముఖంగా కనిపించకపోవడం కూడా విశేషమే! ఇక, గ్లోబల్ సదస్సులో సీఎం కేసీఆర్ ప్రసంగం సోసోగానే ఉంది. మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమంలో చూసినా.. ప్రధాని పక్కన సీఎం కేసీఆర్ కూడా ఒక అతిథిగానే నిలబడి ఉన్నారు. మంత్రి కేటీఆర్ వచ్చే వరకూ రిబ్బన్ కటింగ్ చేసేందుకు ప్రధాని కూడా వేచి ఉండటం విశేషం. ఈ పరిణామాలన్నీ రాజకీయ కోణం నుంచి గమనిస్తే… మంత్రి కేటీఆర్ ను ప్రముఖంగా ప్రొజెక్ట్ చేసేందుకు జరిగిన ప్రయత్నంగా కనిపిస్తోంది. హరీష్ రావు ఢిల్లీలో ఉండటం, గ్లోబల్ సదస్సులో కవితకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం అనేవి వేర్వేరు అంశాలు కావొచ్చు. అది ప్రధాని కార్యక్రమం, ఇది అంతర్జాతీయ సదస్సు కాబట్టి చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్టు జరగవు అనుకోవచ్చు. అయితే, తెరాసలో ఎప్పట్నుంచో వారసత్వ చర్చ అనేది ఉంది కాబట్టి, ఇవన్నీ కేటీఆర్ ను ప్రముఖంగా తెర మీదకు ప్రొజెక్ట్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి.