బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు. అదే సమయంలో నిస్సహాయుడిగా మిగిలిపోతున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలి ప్రతి సభలో కేటీఆర్ మాట్లాడుతోన్న తీరును చూసి ఆ పార్టీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నాయి.
కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంశం, పార్టీ నుంచి వలసలు.. ఇవన్నీ కేటీఆర్ ను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నట్లు ఉన్నాయి. రెండు పిల్లర్లు కుంగితే తప్పేంటి..? ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ జరగడం పెద్ద విషయమా..? అని కామెడీగా మాట్లాడుతుండటం విస్మయానికి గురి చేస్తున్నాయి. రెండు టర్మ్ లు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించి.. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ వ్యాఖ్యలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పార్టీని కష్టకాలంలో వీడి వెళ్తున్న నేతలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా.. పార్టీలోకి తీసుకునేది లేదని వ్యాఖ్యనించడం ఆయన ఫ్రస్టేషన్ లెవల్ కు సూచికగా అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి నేతలు జంప్ అవుతుంటారు. కాకపోతే ఇది తెలంగాణ వచ్చాక శృతి మించేలా చేసింది బీఆర్ఎస్సే. ఉద్యమకారులు బోలెడంత మంది పార్టీలో ఉన్నా వారెవరిని కాదని పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకొని కీలక పదవులు కట్టబెట్టారు. అధికారం కోల్పోయాక వారంతా వలస వెళ్తుంటే కొత్తగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సంప్రదాయం మంచిది కాదనే రీతిలో మాట్లాడుతుండటం కేటీఆర్ నిస్సహాయ స్థితికి అద్దం పడుతోంది.