తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన ఎజెండా పెట్టుకుని పని చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రపంచం మొత్తం ఓ విధమైన సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అన్ని దిగ్గజ సంస్థలు ఇబ్బందుల్లో పడిపోయాయి. ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి తంటాలు పడే పరిస్థితి ఉంది. కొత్త పెట్టుబడుల ఆలోచనలు చేయడం లేదు. అయితే… టెక్నాలజీకి మాత్రం.. మరింత మెరుగైన భవిష్యత్ కనిపిస్తోంది. ఆ రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో.. కేటీఆర్ ఆ వైపు దృష్టి పెట్టారు. ఆయా రంగాలకు హైదరాబాద్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. సందేశం పంపేందుకు ఎప్పటికప్పుడు కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎవరూ నేరుగా వచ్చి.. కలిసే పరిస్థితి లేదు. అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో.. తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడిదారులు కనెక్ట్ అయ్యేందుకు హైటెక్ ఏర్పాట్లు చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో.. ప్రత్యేకమైన వెబ్సైట్ను రూపొందించి అందుబాటులోకి తీసుకు వచ్చారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సంపూర్ణ సమాచారాన్ని ఐటీ, పరిశ్రమల శాఖలు ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్లో పొందుపరిచాయి. వెబ్సైట్లో ఇప్పటికే పలు ప్రభుత్వసేవలకు సంబంధించిన లైవ్లింక్లు ఉన్నాయి. వీటి ద్వారా పెట్టుబడిదారులు ఆయా సేవలను నేరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో.. కేటీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆ విషయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని.. కేటీఆర్ చెబుతున్నారు.
కేటీఆర్ ఐటీ రంగాన్ని హైదరాబాద్ నలుమూలలా విస్తరించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకి అటూ ఇటూ ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను అక్కడి నుంచి తొలగించి.. ఆ స్థానంలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలన్న ఆలోచన చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు.. హైదరాబాద్కు కలసి వస్తున్నాయి. అలాగే.. తయారీ పరిశ్రమలు చైనా నుంచి ఇండియాకు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటన్నింటితో కేటీఆర్… యాక్టివ్గా మారిపోయారు. ఆయన పూర్తిగా పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి కేంద్రీకరించారు. సంక్షోభంలో అవకాశాలు వెదుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.