తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా వేగంగా రంగంలోకి దిగారు. కరోనా ఎఫెక్ట్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని విషయాల్లోనూ మౌలికమైన మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో.. ఎవరూ ఊహించనన్ని మర్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ తయారీ రంగానికి కేంద్రంగా ఉన్న చైనా నుంచి అనేక సంస్థలు .. తమ కార్యకలాపాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాలను ఆలోచిస్తే.. ఇది నిజంగా జరుగుతుందనే అంచనా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. కేటీఆర్ కూడా.. ఇదే అంచనాతో ఉన్నారు. శరవేగంగా ఓ బ్లూ ప్రింట్ ను రెడీ చేసుకున్నారు. వెంటనే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ పెట్టుబడులను వేరే దేశాలకు తరలిస్తున్నాయని, వాటిని అందుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉండాలని పరిశ్రమల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెట్టుబడి అవకాశాలున్న రంగాల్లో మరింత చురుగ్గా పని చేయాలన్నారు. సంక్షోభం వల్ల ఏఏ రంగాల్లో ఏలాంటి పరిస్థితులు, సవాళ్లు ఎదురవుతున్నాయో అధ్యయనం చేసి దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపైన విభాగాల వారీగా పనిచేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలో కేటీఆర్‌కు ఓ విజన్ ఉంది. అమెరికాలో చదువుకుని ..ఎమ్మెన్సీల్లో పని చేసిన అనుభవం ఉండటంతో.. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆయన తనదైన పంధాను అవలంభిస్తున్నారు.
వైరస్ ప్రభావం తగ్గిన తరవాత… సురక్షిత దేశాల్లో పెట్టుబడుల ప్రవాహం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనాను నమ్మడం అంత మంచిది కాదన్న భావన ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఇప్పుడే ప్రారంభమయింది. జపాన్ లాంటి దేశాలు.. చైనాలో ఉన్న తమ దేశాలకు చెందిన ఉత్పత్తి ప్లాంట్లను వీలైనంత త్వరగా తరలించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. బహిరంగంగా ప్రకటించకపోయినా పలు దేశాలు..సంస్థలు..అదే ఆలోచనలో ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయంలో.. వారిని భారత్‌వైపు ఆకర్షిస్తే.. చైనాకు పోటీగా.. ఇండియా ఎదుగుతుందనడంతో సందేహం లేదు. కానీ ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునే చొరవ కావాలి. ఆ చొరవను.. కేటీఆర్ చూపిస్తున్నారు.