కలెక్టర్ పై దాడి ఘటనలో పోలీసులు సంచలనాత్మక ఆరోపణ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు చేసిన తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించారు. కేటీఆర్ డైరక్షన్ లోనే కుట్ర జరిగిందని పోలీసులు తేల్చారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు కుట్ర చేశారని దాన్ని నరేందర్ రెడ్డి అమలు చేశారని తెలిపారు. బోగమోని సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తకు డబ్బులు ఇచ్చి.. మరికొంత మందిని డబ్బులుఇచ్చి పోగు చేసి ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు చేశారని పోలీసులు చెప్పారు.
పోలీసుల రిమాండ్ రిపోర్టు సంచలనంగా మారింది. దాడికి ముందు రెండు రోజుల్లో పట్నం నరేందర్ రెడ్డితో దాడికి పాల్పడిన సురేష్ అనే వ్యక్తి నలభై రెండు సార్లు ఫోన్లో మాట్లాడారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తో ఆరు సార్లు మాట్లాడారు. దీంతో అంతా కలిసి కుట్ర చేశారని పోలీసులకు క్లారిటీ వచ్చింది. ప్రభుత్వంపై తిరగబడుతున్నారని ప్రచారం చేయడానికి ఇలాంటి దాడులకు ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫార్మా భూముల వ్యవహారంపై ఆరు నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ పై దాడి ఘటన సంచలనంగా మారింది. నేరుగా కేటీఆర్ ప్రమేయం ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పెట్టడంతో నేడో రేపో ఆయనకు నోటీసులు జారీ చేయడం లేదా అరెస్టులు చేయడం వంటివి చేసే అవకాశం ఉంది. ఈ నేరాలకు గవర్నర్ పర్మిషన్ అవసరం లేకుండా అరెస్టులు చేయవచ్చు.