రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహార శైలిపై తెరాస వర్గాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో అన్ని కార్యక్రమాల్లో ఆయనే జోక్యం చేసుకుంటున్నారు. నగర మేయర్ నిర్వహించాల్సిన కార్యక్రమాలను కూడా ఆయనే స్వయంగా నిర్వహించేస్తున్నారు! నగరంలో ఇతర తెరాస ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని పోవడం లేదనే అభిప్రాయమూ ఉంది. చేప మందు పంపిణీ ఏర్పాట్లు ఆయనే సమీక్షించారు. తాజాగా జరిగిన బోనాల పండుగ ఏర్పాట్లు కూడా ఆయనే చూశారు. డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల రివ్యూలు కూడా ఆయనే చేసేశారు. ఆసరా పెన్షన్ల కార్యక్రమాంలోగానీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోగానీ నగర మేయర్ ఈ మధ్య కనిపించకుండా పోయారు. మేయర్ రామ్మోహన్ ను పక్కకునెట్టి, అంతా తానే అన్నట్టుగా ప్రొజెక్టు చేసుకోవడం కోసమే తలసాని ఇలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. చివరికి, తలసాని అతి జోక్యం వల్లనే నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇతర ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో, మొన్ననే తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి… నగరంలోని సీనియర్ నేతలకు క్లాస్ తీసుకున్నారు కదా. పరోక్షంగా ఇది తలసానికి బాగానే అర్థమైనట్టుంది! అందుకే, ఇప్పుడు మాట మార్చారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ తరఫున మాట్లాడుతున్నారు! ఆయనకి కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలు ఉండటంతోనే.. ఈ మధ్య కొన్ని ప్రభుత్వ సమీక్షలూ కార్యక్రమాలకూ హాజరు కాలేకపోయారన్నారు. మేయర్, ఇతర నాయకులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు. అందరం పార్టీ కోసమే పనిచేస్తున్నామనీ, కానీ కొంతమంది మధ్య కొంత గ్యాప్ ఉందని వ్యాఖ్యానించారు!!
బోనాల జాతరకు బొంతు రామ్మోహన్ ను తానే స్వయంగా పిలిచాననీ, ఆయనకి ఏవో కారణాలున్నాయనీ అందుకే రాలేదని అన్నారు. ఈ కార్యక్రమాలకు రామ్మోహన్ ఎందుకు రాలేదో ఆయన వివరణ ఇవ్వకుండా, ఆయన తరఫున తలసాని వివరణ ఇచ్చేస్తుండటం విశేషం..! మొత్తానికి, కేటీఆర్ క్లాస్ తలసాని మీద బాగానే పని చేసినట్టుంది. అందుకే, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా ఆయన దృష్టి పెట్టారు. సనత్ నగర్, అంబర్ పేట్, ముషీరాబాద్, గోషామహల్ నియోజక వర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు సమీక్షలు చేశారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తానని ఆ బాధ్యతను తన మీద వేసుకున్నట్టుగా మాట్లాడారు.