బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను జిమ్ సెషన్లో డిస్క్ జారిపోయినట్లుగా తెలిపారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ లో ఉంటానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కేటీఆర్ గతంలోనూ రెండు సార్లు ఇలా జిమ్ లో గాయపడటం ద్వారా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ఆయన.. ఆ సభ ముగిసిన తర్వాత రోజే.. గాయపడ్డారు. గతంలో కాలికి గాయమైనప్పుడు ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ సారి ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయలేదు.
ఎల్కతుర్తి సభ కోసం కేటీఆర్ దాదాపుగా నెల రోజుల పాటు విస్తృతంగా శ్రమించారు. అయితే వేదిక మీద ఆయన మాట్లాడలేకపోయారు. కేసీఆర్ సభా వేదికపై రాక ముందు మాట్లాడలేదు. వచ్చిన తరవాత కేసీఆర్ మాత్రమే మాట్లాడారు. ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు.. ముఖ్యమైన నేతలెవరూ మాట్లాడలేదు. కేసీఆర్ మాట్లాడటమే ముఖ్యమని..ఇతర నేతలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారని బీఆర్ఎస్ క్యాడర్ లైట్ తీసుకుంది కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఎల్కతుర్తి సభా నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల మధ్య కొన్ని అభిప్రాయబేధాలు వచ్చాయన్న ప్రచారం బయట జరుగుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి ఎదురొడ్డికి పోరాడుతున్న కేటీఆర్, హరీష్‌లను కేసీఆర్ చిన్న పిల్లలుగా చెప్పారు. వారు ప్రశ్నిస్తూంటేనే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. ఇది కూడా పార్టీలో కీలక నేతల్ని హర్ట్ చేసిందని అంటున్నారు. అయితే కేటీఆర్ విశ్రాంతికి.. ఆ పరిణామాలకు సంబంధం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.