ప్రపంచంలో అత్యంత వేగంగా కాలుష్య కోరల్లోకి వెళ్తున్న దేశం ఇండియా. అభివృద్ధి నమూనా పేరిట అడవుల విధ్వంసంతో పర్యావరణం దారుణంగా దెబ్బతింటుంది. ఇందుకు మారుతున్న వాతావరణ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. భగభగ మండుతున్న ఎండాకాలంలోనూ సడెన్ గా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం కురువడం చూస్తూనే ఉన్నాం. చలికాలంలో మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద మోత మోగించడం జరుగుతూనే ఉంది. పర్యావరణహితం కోసం పర్యావరణ ప్రేమికులు మొక్కలను నాటండి.. అడవులను కాపాడండి అని పిలుపునిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే HCU భూవివాదంలో పర్యావరణ పరిరక్షణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎకనామిక్ టైమ్స్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం ఓ సంక్షోభ కాలం కొనసాగుతోంది. అడవుల పరిరక్షణకు పూనుకోకపోతే సంక్షోభ సమయాన్ని చవిచూడాల్సి రావడం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ రాజకీయాలను హీటేక్కించిన కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సియూ విద్యార్థుల పోరాటం అందర్నీ అటువైపు తొంగిచూసేలా చేసింది.400ఎకరాల ల్యాండ్ కోసం విద్యార్థులు నిర్విరామంగా ఆందోళన చేపట్టారు. అరెస్టులు అయ్యారు. లాఠీదెబ్బలను ఎదుర్కొన్నారు. అయితే, ఈ ల్యాండ్ ప్రభుత్వందా ? లేక సెంట్రల్ వర్శిటీదా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఈ వివాదం తీవ్రరూపం దాల్చుతుండగా..అటు ఢిల్లీతోపాటు హైదరాబాద్ కూడా కాలుష్యకోరల్లోకి తొందరలో ప్రయాణం చేస్తుందా? అనే ఆందోళన అందరిలోనూ తలెత్తింది. ఢిల్లీలో కాలుష్యం వలన వెహికిల్స్ సరిబేసి విధానంతో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధాని ప్రాంతంలో పరిస్థితి ఇలా ఉండగా.. దేశానికి రెండో రాజధానిగా చేయాలని అంటోన్న హైదరాబాద్ లో 400ఎకరాల్లో చెట్లను నరకడం , పూర్తిగా అటవీప్రాంతంగా మారిన ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ కారిడార్ గా మార్చడం కార్బన్ డై ఆక్సైడ్ ను ఆస్వాదించడమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
కంచ గచ్చిబౌలి ల్యాండ్ విషయంలో విద్యార్థుల పోరాటానికి ఊహించని మద్దతు రావడానికి కారణం.. రాజకీయం కాదు. ఒక అరుదైన వృక్షజాతిని, పుష్పాలు, జంతువులను కాపాడుకోవాలనే వ్యక్తీకరణే. ఆ భూమి తమదని విద్యార్థులు చెప్పడంతోపాటు నగరానికి ఇక్కడి అటవీప్రాంతం ఊపిరిపోస్తోందని చెప్పడంతో అన్ని వర్గాలు విద్యార్థుల పోరాటాన్ని సమర్థించాయి. టెక్నికల్ గా ఆ భూమి ప్రభుత్వానిదే కావొచ్చు కాని, హైదరాబాద్ ప్రాంతాన్ని కాలుష్యకోరల్లోకి తీసుకెళ్ళే విధానాన్ని సమర్ధించకూడదు అనే ఒకే ఒక్క కారణంతో విద్యార్థుల పోరాటం ముందు సర్కార్ తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూముల్లో పెరగిన దట్టమైన అడవులు ,వీచే స్వచ్చమైన గాలి , నెమళ్లు, పక్షులు, సీతాకోకచిలుకలు, అడవి పందులు, జింకలు, 220 ఎకరాల స్థలంలో 734 జాతుల మొక్కలు, 15 జాతుల సీతాకోకచిలుకలు, 10 జాతుల కీటకాలు, 72 జాతుల మొక్కలు అరుదైనవి, పీకాక్ లేక్ వంటి ఉన్నాయి. ముష్రూమ్ రాక్ అనే ఒక అద్భుతమైన సహజ నిర్మాణం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఉన్నపళంగా ఈ వృక్ష, అటవీ సంపదను అభివృద్ధిలో భాగంగా విధ్వంసం చేసేందుకు అంగీకారం అంత ఈజీ కాదు.
ఆ ప్రాంతంలో అటవీ , జంతు సంపద మాత్రమే కాదు… చిన్న , చిన్న సరస్సులు కూడా ఉన్నాయి. ఇవి హైదరాబాద్ లో భూగర్భ జలస్థాయిని పెంచడంలో దోహదం చేస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతం ఐటీ కంపెనీలకు అడ్డాగా మారితే , భవిష్యత్ లో పొల్యూటెడ్ నగరంగా మారడంతోపాటు తీవ్రమైన నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం ఖాయం. అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరు కాని , పర్యావరణ సమతుల్యతను విచ్చిన్నం చేస్తూ నిర్మాణం అయ్యే అభివృద్ధిని ఎవరూ కాంక్షించరు.
2015లో కేసీఆర్ ప్రారంభించిన హరితహారం పథకంపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ.. తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరిగింది. మొత్తం 273 కోట్ల మొక్కలు నాటారు మరియు వాటిని సంరక్షించారు. వివాదాస్పదంగా మారిన కంచగచ్చబౌలి భూములను కేసీఆర్ హయాంలోనూ వేలం వేసేందుకు ప్రయత్నించారు అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ , కోర్టు పరిధిలో ఉండటంతో ఆగిపోయారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయం ఎలా ఉన్నా, నగరానికి లంగ్స్ గా ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే విద్యార్థుల డిమాండ్ ను సమర్థించింది.
అభివృద్ధి పేరుతో , పెట్టుబడులను ఆకర్షించాలనే ఎజెండాతో అడవులను లేకుండా చేస్తే మానవ మనుగడే ప్రమాదంలోకి వెళ్తుంది. అందుకే ఈ విషయంలో రేవంత్ సర్కార్ కొంత వెనక్కి తగ్గాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చూడాలి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందో