తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అంతర్జతీయ వేదికల నుంచి అనేక ఆహ్వానాలు వస్తూంటాయి. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా వస్తున్నాయి. మొహాలీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించి, ప్రసంగించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వచ్చే నెల 11న మొహాలీలోని ఐఎస్బీ క్యాంపస్‌లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ 8వ బ్యాచ్‌ను ప్రారంభించి, ప్రసంగించనున్నారు.
ఐఎస్బీ డీన్ నుంచి వచ్చిన ఆహ్వానంలో కేటీఆర్ నాయకత్వ సామర్థ్యాలను ప్రశంసించారు. ఈ ప్రోగ్రాంను అభ్యసించేవారు పబ్లిక్ పాలసీలోని వివిధ అంశాలు, దాని రూపకల్పన ప్రక్రియను అర్థం చేసుకునేందుకు మీ అనుభవం, సలహాలు ఎంతో దోహదపడుతాయని డీన్ తన లేఖలో పేర్కొన్నారు. మీతో సంభాషించడం, మీ దృక్కోణాలను వినడం ద్వారా వారు ఎంతో ప్రయోజనం పొందుతారని ఆశించారు.
ఏఎంపీపీపీ అనేది పబ్లిక్, ప్రైవేటు రంగాల్లోని మిడ్-కెరీర్ నిపుణులకు అందించే ప్రోగ్రాం. టఫ్ట్స్ యూనివర్శిటీ సహకారంతో ఐఎస్బీకి చెందిన భారతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈ ప్రోగ్రాంను రూపొందించింది. భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్ ద్వారా దీనికి ఆమోదం లభించింది. కాగా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్, రైల్వే తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతోపాటు రాజకీయ నాయకులు, ప్రైవేటు రంగంలోని సీనియర్ ప్రొఫెషనల్స్ 50 మంది ఇందులో పాల్గొంటున్నారు. వీరందరికీ కేటీఆర్ పాఠాలు చెప్పనున్నారు