రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈ అంశంపై చివరి క్షణం వరకూ క్లారిటీ ఇవ్వని కేసీఆర్.. చివరి క్షణంలో సిన్హాకు మద్దతు ప్రకటించి.. కేటీఆర్‌ను ఢిల్లీ పంపారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. నిజానికి ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటే.. హైప్ వచ్చేది. కానీ కేసీఆర్ మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను మాత్రమే పంపారు. దీంతో ఢిల్లీ రాజకీయాల్లోనూ కేటీఆరే కనిపించారు. ఇప్పటి వరకూ తెలంగాణకు సంబంధించినంత వరకూ టీఆర్ఎస్ రాజకీయాలు మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నాయి.
ఢిల్లీకి సంబంధించినంత వరకూ ప్రధానంగా కేసీఆరే ఇన్వాల్వ్ అవుతున్నారు. కేసీఆర్ తరపున కవిత పనులు చక్క బెడుతున్నారు. ఒక వేళ కేసీఆర్ కాకపోతే.. కవిత ఢిల్లీ వెళ్లి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించి ఉండవచ్చని కానీ అలా జరగలేదని.. కేటీఆర్‌నే పంపారని ఇది అనూహ్యమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త జాతీయ పార్టీపై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్న కేసీఆర్… ఆ పార్టీ పై కీలక అప్ డేట్తోనే మళ్లీ తెర ముందుకు రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అప్పటి వరకూ బ్యాక్ గ్రౌండ్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. యశ్వంత్ సిన్హా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేకపోవడంతో… కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే.. పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని.. గట్టి పోటీ ఉంటే… ప్రయత్నించినా ఫలితం ఉండేదంటున్నారు. కారణం ఏదైనా కేసీఆర్ చాలా కాలంగా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. మరో నెల రోజుల వరకూ ఆయన అలాగే రాజకీయం చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.