మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్ధించారు. తమ పార్టీ తరఫున ఆమెపై ఎవరూ మాట్లాడలేదని చెబుతూనే..ఇదే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలపైన ట్రోలింగ్ జరగలేదా అని ప్రశ్నించారు. అంటే ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్సేనని పరోక్షంగా బయటపెట్టేశారు.
గతంలో హీరోయిన్ల ఫోన్లు ట్రాప్ చేశారని కొండా సురేఖ కామెంట్స్ చేశారని, ఆమె ఆరోపణలను ఎదుర్కొన్నది మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడరా అంటూ అని కొండా సురేఖను ప్రశ్నించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి మహిళలంటే ఎనలేని గౌరవమని చెప్పుకునే కేటీఆర్..ఓ మహిళా మంత్రిపై జరిగిన ట్రోలింగ్ ను వ్యతిరేకించకుండా తెలివిగా సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. గతంలో మీరు చేసింది మేము చేస్తున్నామనే తరహాలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు చేయడం కామన్. అవన్నీ సహేతుకంగా ఉండాలి. ప్రత్యర్ధులను సైతం ఆలోచింపజేసేలా ఉండాలి. బీఆర్ఎస్ కూడా పదేపదే ఇదే డైలాగ్ ను వల్లెవేస్తుంది. కానీ, కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు ఓ మహిళా మంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. కించపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, కేటీఆర్ డైరక్షన్ లో సాగుతున్న సోషల్ మీడియా గీత దాటుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ కేటీఆర్ మాత్రం జరిగిపోయిన తప్పును పొరపాటు జరిగిపోయిందని చెప్పకుండా..దానిని సమర్ధించుకునే ప్రయత్నం చేయడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అంటున్నారు.