రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో… ఇక తెలంగాణ పార్టీ బాధ్యతలను.. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు.. ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేసేందుకు సమర్థుడికి పట్టం కట్టాలని కేసీఆర్ భావించారు. ఆ క్రమంలో కేటీఆర్‌ను ఎంపిక చేశారు.
తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ను ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉంచే విషయంలో కేటీఆర్ అత్యంత సమర్థంగా ఉంటారని.. కేసీఆర్ భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ బాధ్యతలను.. కేటీఆర్ తీసుకున్నారు. సీమాంధ్రుల మనసు గెల్చి.. అసాధ్యమనుకున్న విజయాల్ని సాధించి పెట్టారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో కేసీఆర్ పై పనిభారం పెరుగుతున్న కారణంగా.. బాధ్యతలను బదిలీ చేయాలనుకున్నారు. పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ నిర్వహించారు. కొత్త బాధ్యతలతో ఆయనకు టీఆర్ఎస్పై పూర్తిగా పట్టు చిక్కనట్లే భావించవచ్చు.