తెలుగుదేశం పార్టీని ఎంతలా అవమానించాలో అంతగా అవమానించే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆ పార్టీని చూపించి తమ పార్టీకి హైప్ ఎక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు టీడీపీ గురించి మాట్లాడనిదే రోజు గడవడం లేదు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ .. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ ఆపేసిందని ప్రకటించారు. నిజమా అని టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారే దీని గురించి చెప్పుకోలేకపోయారు. ఇప్పుడల్లా ప్రైవేటీకరణ ఉండదని గనుల మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన మాత్రం వచ్చింది. ఇది తమ ఘనతేనని టీడీపీ చెప్పుకోలేకపోయింది. కానీ కేటీఆర్ క్లెయిమ్ చేశారు.
ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రాంతీయ పార్టీలకి సీట్లు వస్తేనే రాష్ట్రాలకు మంచిదని.. కేటీఆర్ చెప్పడానికి. బీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఇచ్చి ఉంటే సింగరేణిని కాపాడేవారిమని ఆయన వెర్షన్. ఇప్పుడు సింగరేణికి ఎందుకు కష్టం వచ్చిందంటే బొగ్గు గనులు వేలం వేయాలని కేంద్రం నిర్ణయించడమే. కారణం ఏదైనా.. టీడీపీని చూపించి.. తాము కూడా అలాగే చేసేవారమని.. టీడీపీ చేసినట్లుగా చేయరా అని అడగడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో కేటీఆర్ , హరీష్ రావు ఏ మాత్రం మొహమాట పడటం లేదు.
ఎన్నికలకు ముందు జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని అడిగిన వారికి..అడగని వారికి చెప్పారు కేసీఆర్, కేటీఆర్. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత.. టీడీపీ జపం చేస్తున్నారు.కేంద్రంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తూండటంతో.. గుడ్ లుక్స్ కోసం కూడా పనికి వస్తాయని ఇలా అంటున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.