తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో మిగిలిన నేతలందరినీ గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉంచి తన కుమారుడు కేసీఆర్ ఒక్కరికే పూర్తి బాధ్యత అప్పగించినపుడే, ఆయన ఆవిధంగా ఎందుకు చేసారో అర్ధమయిపోయింది. అతనిని తన రాజకీయ వారసుడుగా ప్రజలు, పార్టీలో నేతలు ముఖ్యంగా పార్టీలో హరీష్ రావు వంటి నేతలు గుర్తించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొన్నారు.
గ్రేటర్ ఎన్నికలలో తమ పార్టీ విజయం తధ్యమని ఆయన దృడంగా నమ్మిన తరువాతనే తన కొడుకుకి దాని పూర్తి బాధ్యతలు అప్పగించారు. తద్వారా ఆ విజయం తాలూకు పూర్తి క్రెడిట్ తన కుమారుడికే దక్కాలని ఆయన ఆశించారు. ఆయన ఆశించినట్లే గ్రేటర్ ఎన్నికలలో తెరాస అద్భుతమయిన విజయం సాధించింది. కె.టి.ఆర్. రాజకీయ శక్తిగా ఆవిర్భవించారు. ఇక ఆయన నాయకత్వాన్ని పార్టీలో ఎవరూ కూడా ప్రశ్నించలేరు.
అయితే ‘తన కుమారుడే తన రాజకీయ వారసుడు’ అని కేసీఆర్ ప్రకటించలేదు. ఆ అవసరం ఇప్పుడు లేదు కూడా. ఆవిధంగా చేస్తే ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు కూడా మళ్ళీ విమర్శలు గుప్పించవచ్చును. కానీ శాస్త్ర ప్రకారం వారసత్వ ప్రకటన జరగవలసి ఉంది కనుక దానిని తన కుమార్తె కవిత ద్వారా చేయించేసి తన మనసులో మాటను పార్టీ నేతలు అందరికీ విస్పష్టంగా తెలియజేసారు.
తమ తండ్రి కేసీఆర్ కి అసలు సిసలయిన వారసుడు తన సోదరుడు కె.టి.ఆర్. అని కవిత ఈరోజు ప్రకటించేశారు. తన తండ్రి అప్పజెప్పిన బాధ్యతను ఆయన చాలా సమర్ధంగా నిర్వహించారని ఆమె మెచ్చుకొన్నారు. శాస్త్రప్రకారం ప్రకటన కూడా జరిగిపోయింది కనుక ఇక ఈ విషయంలో పార్టీలో నేతలు ఎవరికీ సందేహాలు లేకుండా చేసారు.