ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీలో చేరలేదని, మూడింట రెండు వంతుల మంది బీఆర్ఎస్ లో చేరారని కేటీఆర్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఒక్కొక్కరిని కాదు ఒకేసారి మూడింట రెండు వంతుల మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని కేటీఆర్ సలహా ఇచ్చినట్లుగా ఉంది. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం కేటీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఎప్పుడు , ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారో తెలియక టెన్షన్ పడుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలపై ఎందుకు ఈ టెన్షన్ అనుకున్నారేమో , రేవంత్ ను కేటీఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక్కొక్క ఎమ్మెల్యేను తాము బీఆర్ఎస్ లో చేర్చుకోలేదని, మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ కూడా బీఆర్ఎస్ దారిలోనే ఒకేసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని కేటీఆర్ సలహా ఇస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.
తాజాగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు కాకుండా ఒకేసారి పదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే అవకాశం లేకపోలేదు.