కేటీఆర్కు అరెస్టు ముప్పు తాత్కలికంగా తప్పింది. ప్రభుత్వానికి ఆయనను అరెస్టు చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ.. కేటీఆర్ లాయర్ మాత్రం ఆయనను అరెస్టు చేయకుండా ఉండేలా శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆయన చంద్రబాబుపై పెట్టిన స్కిల్ కేసును కూడా ఉపయోగించుకున్నారు. రాజకీయ కారణాలతోనే చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టారని ఇప్పుడు కేటీఆర్ పై కూడా అలాంటి కేసు పెట్టారని కేటీఆర్ లాయర్ సిద్దార్థ దవే హైకోర్టులో వాదించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సిద్ధార్ధ దవే వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చి తీర్పును రిజర్వ్ చేశారు.
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు కేసును క్వాష్ చేస్తారా లేదా అన్నది చెప్పడం కష్టం. కానీ నమోదైన ఎఫ్ఐఆర్… గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత విచారణ ప్రారంభించినందున హైకోర్టు అప్పటికప్పుడు క్వాష్ చేస్తుందని కేటీఆర్ తరపు లీగల్ టీం కూడా ఎక్స్ పెక్ట్ చేయదు. కానీ అరెస్టు కాకుండా మాత్రం రిలీఫ్ పొందవచ్చు. తీర్పు ఎప్పుడు వచ్చినా అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్న పాయింట్ ఖచ్చితంగా ఉంటుందని.. చంద్రబాబు కేసును ప్రస్తావించడంతో వారి వాదనకు మరితం బలం చేకూరిందని అంటున్నారు.
అయితే ఈడీ కేసులకు.. హైకోర్టులో రాబోయే తీర్పునకు సంబంధం ఉండకపోవచ్చన్న వాదన ఉంది. హైకోర్టు తీర్పు సానుకూలంగా వస్తే ఈడీ కేసు ఉండదని అనుకుంటున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సీబీఐ పెట్టిన ఎఫ్ఐఆర్ లపై మొదట విచారణ జరిపిన తర్వాతనే ఈడీ కేసుల్లో విచారణ జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఒక్క కేసుల్లో తప్ప అన్ని కేసుల్లోనూ యథావిధిగా అనేక మందిపై ఈడీ, సీబీఐ కేసుల విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ అంతే జరుగుతోంది. జగన్ కేసులో తీర్పుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఆ కేసు ను బేస్ చేసుకుని ఈడీ కేసు చెల్లదని కేటీఆర్ లీగల్ టీం వాదించే అవకాశం ఉంది.