కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడమూ, కేటాయింపుల మీద చర్చలూ విశ్లేషణలూ అన్నీ జరిగిపోవడమూ అయిపోయింది. కానీ, తెలంగాణలో మాత్రం తెరాస, భాజపాల మధ్య ఇదో రాజకీయ విమర్శనాస్త్రంగా మారిపోయింది. బడ్జెట్ వచ్చేసి మూడు రోజులు దాటుతున్నా… తెలంగాణ కేటాయింపుల చర్చను ఈ రెండు పార్టీలూ వదలడం లేదు. బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాన్నే మంత్రి కేటీఆర్ ఇంకా కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాయలంలో మంత్రి మాట్లాడుతూ… కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రత్యేకంగా నిధులు తీసుకుని రమ్మంటే, జాతీయ హోదా తీసుకుని రమ్మంటే అది భాజపా నేతలకు చేతగాలేదని విమర్శించారు. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా హక్కుగా రావాల్సిన పైసలు కంటే అరపైసా అయినా ఎక్కువ తీసుకొచ్చావా లచ్చన్నా అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ని ప్రశ్నించారు. గడచిన ఆరు కేంద్ర బడ్జెట్లలోనూ తెలంగాణకు అన్యాయమే జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.
దీనికి కౌంటర్ గా లక్ష్మణ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ని నయా గజినీ అన్నారు. కేంద్రం తెలంగాణకు చేసిన సాయంపై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ కి సవాల్ చేశారు. తెలంగాణలో సాధించిన ప్రగతి గురించి మీరు ఇవాళ్ల చెబుతున్న దాన్లో సింహభాగం నిధులు కేంద్రం ఇచ్చినవే అని మర్చిపోతున్నారన్నారు. ప్రతీ పంచాయతీకి దాదాపు రూ. 80 లక్షలు, ప్రతీ పట్టణానికి దాదాపు రూ. 20 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులే అన్నారు. యూపీతో పోల్చితే ఏడు రెట్లు అధికంగా రాష్ట్రానికి నిధులు తెచ్చామన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలవారీగా కేటాయింపులు ఉండవనేది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. మీరు కమిషన్లు కాజేయడం కోసం భారీగా ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే వాటికి కేంద్రం నిధులు ఇవ్వదన్నారు లక్ష్మణ్.
ఈ చర్చ ఎన్నాళ్లు కొనసాగినా ఫలితం ఏమైనా ఉంటుందా.. అంటే, లేదనే చెప్పాలి. చట్టప్రకారం ఇవ్వాల్సినవి తప్ప, అదనంగా ఏమీ ఇవ్వలేదని కేటీఆర్ అంటున్నారు. అంటే, రాష్ట్రాల వాటాల ప్రకారం రావాల్సినవి వస్తున్నట్టు ఆయనే ఒప్పుకున్నట్టే కదా! కేంద్రం తన పని తాను చేసినట్టే. అలాగే, లక్ష్మణ్ చెబుతున్న లెక్కలు కూడా… మోడీ సర్కారు తెలంగాణకు అదనంగా ఇచ్చినవేం కాదు. రాష్ట్రాల వాటాల ప్రకారం ఇవ్వాల్సినవే వారూ ఇచ్చారు. దాన్ని రాష్ట్రం పట్ల ఉన్న ప్రత్యేక ప్రేమగా చాటి చెప్పే ప్రయత్నం ఆయనా చేస్తున్నారు. కేటీఆర్ లక్ష్మణ్ చెబుతున్నది ఒకటే. కేవలం ఒకరిపై ఒకరు విమర్శించుకోవడానికి ఒక సమకాలీన అంశం కావాలన్నట్టుగా మాత్రమే కేంద్ర బడ్జెట్ అంశాన్ని వాడుకుంటున్నారు! ఇంకా దీన్ని ఎన్నాళ్లు కొనసాగిస్తారో చూడాలి.