బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్నాళ్లుగా అపరిచిత రాజకీయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు స్థిరమైన రాజకీయ వ్యూహం లేదని, గాలివాటంలాగా రాజకీయం చేసుకుంటూ పోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది తాత్కాలికంగా ప్రయోజనం చేకూర్చినా భవిష్యత్ లో ఆయన రాజకీయ అస్తిత్వానికి ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. అందుకే కేటీఆర్ అర్జెంట్ గా ఓ వ్యూహకర్తను అపాయింట్ చేసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదివరకు డిలిమిటేషన్ ను వ్యతిరేకించిన కేటీఆర్ సడెన్ గా కొత్త వాదనను వినిపిస్తున్నారు. డిలిమిటేషన్ జరిగితే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ మినహా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు డిలిమిటేషన్ జరిగినా అది బీఆర్ఎస్ కే ఎక్కువ ప్రయోజన్మం చేకూర్చుతుందనేది ఆయన ఉద్దేశం. అయితే , తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని డిలిమిటేషన్ ను గట్టిగా వ్యతిరేకించారు.
ఈ మీటింగ్ ముగిసిన కొన్నిరోజులకు ఆయన మనసు మారినట్లు ఉంది. తాజాగా డిలిమిటేషన్ జరిగినా నష్టమేమి లేదనే తరహలో కేటీఆర్ మాట్లాడటం ఆయన గాలివాటు రాజకీయానికి నిదర్శమని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంతో బీఆర్ఎస్ కు లాభం చేకూరినా,కేటీఆర్ కు ఓ నిశ్చిత అభిప్రాయం ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న తెరమీదకు వస్తోంది.అందుకే ఓ అంశంపై స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో కేటీఆర్ ఫెయిల్ అవుతున్నారనే వాదనలు విస్తృతంగా వినిపిస్తున్నాయి.
అలాగే, కొద్ది కాలంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ తరుచుగా చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఏ ఎన్నిక అయినా బీఆర్ఎస్ దే గెలుపు అని చెప్తున్నారు కానీ,ఎమ్మెల్సి ఎన్నికల్లో అభ్యర్థులను కూడా ప్రకటించకుండా హ్యండ్సప్ చెప్పేశారు. దీంతో ఆయన చెప్తున్న దానికి , జరుగుతున్న పరిణామాలకు పొంతన ఉండటం లేదని అందుకే అర్జెంట్ గా కేటీఆర్ ఓ రాజకీయ వ్యూహకర్తను నియమించుకోవాలని సూచనలు వస్తున్నాయి. లేదంటే , సొంత పార్టీ నేతలు కూడా ఆయన అభిప్రాయాలను విశ్వసించే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు.