టీఆర్ఎస్ తరపున గ్రేటర్ ప్రచార బాధ్యతల్ని తీసుకున్న కేటీఆర్ పలు చోట్ల అమరావతి ప్రస్తావన తీసుకు వస్తున్నారు. అది కూడా బీజేపీపై విమర్శలు చేసేందుకు ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అమరావతి కి మోడీ ఏం చేయలేదని.. చెంబుడు నీళ్లు, మట్టి మాత్రమే ఇచ్చారని అంటున్నారు. కేటీఆర్ ఎక్కువగా ఈ మాటలు ఆంధ్రా సెటిలర్లు ఉన్న దగ్గరే చెబుతున్నారు. అమరావతిపై కేటీఆర్కు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు కానీ.. ఆంధ్ర ప్రజల్లో అమరావతి సెంటిమెంట్ ఉందన్న నమ్మకం రావడంతోనే… ఇలా ప్రకటలు చేస్తున్నారని అంచనాకు రావొచ్చు. అమరావతికి బీజేపీ అన్యాయం చేసిందని గుర్తు చేస్తే.. సీమాంధ్ర ఓటర్లు బీజేపీకి కాకుండా..టీఆర్ఎస్కు ఓటు వేస్తారని కేటీఆర్ విశ్లేషించుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
కానీ అమరావతి విషయంలో ఇప్పుడు కేటీఆర్ బాధపడుతున్నారు కానీ.. టీఆర్ఎస్ స్టాండ్ మొదటి నుంచి వేరేగా ఉంది. అమరావతిని డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అని కేసీఆర్ పోల్చారు. కట్టవద్దని తానే జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చినట్లుగా కూడా చెప్పారు. ఆ సలహా ప్రకారమో.. సొంత అజెండా ప్రకారమో కానీ.. జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆపేశారు. రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించినప్పుడు.. కేసీఆర్, కేటీఆర్ కూడా.. మద్దతు ప్రకటించారు. అది మంచి నిర్ణయం అన్నారు. అప్పుడు అమరావతి సెంటిమెంట్ గురించి పట్టించుకోలేదు.
ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు.. సెటిలర్ల ఓట్లు అవసరం వచ్చినప్పుడు.. కేటీఆర్ అమరావతి గురించి మాట్లాడుతూంటారు. హైదరాబాద్లోఐటీ చంద్రబాబు వల్లే అభివృద్ధి చెందిందని సమావేశాల్లో చెబుతూంటారు. ఓట్లు దాటిపోయిన తర్వాత మాత్రం.. తమ రాజకీయ ప్రయోజనాల ప్రకారం చూసుకుంటూ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహం అమలు చేశారు. మంచి ఫలితాలు సాధించారు. సీమాంధ్ర ఓటర్లలో విభజన సాధించారు. ఈ సారి అమరావతిని పొగిడి ఏదైనా ప్రయోజనం పొందుతారో లేదో వేచి చూడాలి..!