జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకూ సూపర్అంటూ వస్తున్న టీఆర్ఎస్ ఒక్క సారిగా మాట మార్చేసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు ఏపీ నరకం అయిపోయిందని తేల్చేశారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపై తీవ్ర విమర్శలు చేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో ఏపీకి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం విలువ ఏంటో తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. తాను చెప్పడం కాదని.. మన వాళ్లు కూడా ఒకసారి ఏపీకి వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.మరోవైపు తెలంగాణను అప్పుల రాష్ట్రం అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంపైనా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని.. కేసీఆర్ అప్పు చేసిన డబ్బులను నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగం కోసం ఖర్చు చేశామని.. తాము చేసే అప్పు భవిష్యత్ తరాల మీద పెట్టుబడి అవుతుందని వివరించారు. అప్పుచేసి పప్పు బెల్లాలను పంచితే తప్పు అవుతుందని.. అప్పు చేసి పునరుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెడితే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయంలోనూ ఏపీపై సెటైర్లు వేశారు.
ఇప్పటి వరకూ హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వంటి మంత్రులు ఏపీ పాలనపై విమర్శలు చేసేవారు. జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న కేటీఆర్ ఒక్క సారిగా రివర్స్ అవడంతో వైఎస్ఆర్సీపీలో కూడా విస్మయం వ్యక్తం అవుతోంది. దీనిపై వెంటనేస్పందించాలని కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరికి సజ్జల సలహా ఇచ్చారు. మల్లాది విష్ణుతో పాటు మంత్రి జోగి రమేష్ కూడా స్పందించారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేటీఆర్ అలా అన్నారని అంటున్నారు.