భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ థూం..ధాం చేసిన ప్రెస్మీట్లో పది వేల కోట్ల స్కాం జరిగిందని పదే పదే ఆరోపించారు. కేంద్రం విచారించకపోతే బీజేపీ, రేవంత్ ఒకటే అని కూడా నిర్ణయం ప్రకటించేశారు. అయితే ఆయన చెప్పిన వివరాల్లో స్కాం ఎక్కడ జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ బీజేపీ ఎంపీ పేరును సీక్రెట్ గా పెట్టానంటూ.. మరో రకమైన విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు.
రూ.10వేల కోట్ల అప్పు- ప్రభుత్వం ఖాతాలోనే జమ !
కంచ గచ్చిబౌలి భూములపై న్యాయపరమైన వివాదాలన్నీ పరిష్కారమైన తర్వాత ఆ భూములను ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టు పెట్టారు రేవంత రెడ్డి. ఈ లావాదేవీని పూర్తి చేయడానికి ఓ ఫైనాన్స్ సేవల సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. బ్యాంకులో తాకట్టు అంటే చిన్న విషయం కాదు. అదీ కూడా ఓ స్థలం విషయం. ఆ సంస్థ అన్ని వ్యవహారాలు చక్కబెట్టింది. పది వేల కోట్లు అప్పు ఇప్పించింది.ఆ డబ్బు ప్రభుత్వం ఖాతాలో పడ్డాయి. ఈ సేవలు అందిచినందుకు ఆ సంస్థ .. 0.25 పర్సంటో.. 0.5 పర్సంటో కమిషన్ తీసుకుంది. అది రూ.170 కోట్లు అయింది. ఇదంతా లీగల్. ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చెప్పింది.
ప్రభుత్వ శాఖల విలువ అంచనాల్లో తేడాలుంటే స్కామా ?
400 ఎకరాల భూమి విలువ 5,239 కోట్లు అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ చెప్పిందని కేటీఆర్ ప్రకటించారు. అదే సమయంలో ఆ భూమి విలువ రూ. 30 వేల కోట్లు అని రెవెన్యూ శాఖ చెప్పిందని ఇంత కంటే పెద్ద స్కామ్ ఏముటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ విలువలు.. మార్కెట్ విలువలు గురించి తెలియని వారికైతే ఇది వింతగానే ఉంటుంది. వాటి గురించి తెలిసిన వారు అయితే ఇందులో స్కామ్ ఏముందని తలగోక్కుంటారు. ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్.. మార్కెట్ విలువను అంచనా వేసి రుణం ఇచ్చిందని.. ప్రభుత్వ విలును కాదని ఆయన అభియోగం. అంటే లోన్ ఎక్కువ వచ్చిందని స్కామ్ అంటారా ?
ఏ శాఖది అయితే ఏమయింది ప్రభుత్వానిదేగా ?
కోర్టు కేసులు పరిష్కారమయ్యాక ఆ భూమి టీజీఐఐసీకి బదలాయించారు. కానీ తమది కాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెడుతుందని కేటీఆర్ కొన్ని లాజిక్కులు చెప్పారు. కానీ ఏ శాఖ వద్ద ఉన్నా అది ప్రభుత్వ భూమే. ప్రైవేటు వ్యక్తిది కాదు. లిటిగేషన్ భూమికి ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్ ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్న. అంటే ప్రభుత్వానికి అప్పు ఇవ్వడమే పెద్ద స్కామ్ గా చెబుతున్నారు.
కేటీఆర్ చెబుతున్న బ్రోకరేజీ సంస్థ ‘ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్ ప్రైవేటు లిమిటెడ్’ బీజేపీ ఎంపీది కాదని ఇంటర్నెట్లో చూసిన ఎవరికైనా అర్థమవుతోంది. అ సంస్థకు ట్రాక్ రికార్డు ఉంది. లీగల్ గానే కమిషన్ తీసుకుంది. అంతా రికార్డుల్లో ఉంది. కానీ కేటీఆర్ లంచం అంటున్నారు. అసలు మొత్తంగా ఈ వ్యవహారం స్కాం ఏం జరిగిందో చెప్పకుండా.. కేటీఆర్ స్కాం..స్కాం అని కేకలేశారు. కానీ దానికి బేస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.