ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసి వచ్చిన తర్వాత కేసీఆర్ నేరుగా ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. రెండు వారాల తర్వాత శనివారమే ఆయన తిరిగి ప్రగతి భవన్‌కు వచ్చారు. రెండు వారాల పాటు ఫామ్‌హౌస్‌లో ఉన్నారంటే.. ఆయన కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుని ఉంటారని చర్చ టీఆర్ఎస్లో ప్రారంభమయింది. ఫామ్ హౌస్ నుంచి వచ్చిన సూచనలతో కొంత మంది ఎమ్మెల్యేలు.. మూడు నెలల్లో… కేటీఆర్ సీఎం అవుతారనే ప్రకటనలు చేయడం ప్రారంభించారు. దీంతో… కేటీఆర్ పట్టాభిషేకం విషయంలో కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
రెండు వారాల పాటు ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్ అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులను మాత్రమే పిలిపించుకుని మాట్లాడారు. దీంతో కేటీఆర్‌ను సీఎం సీటు పై కూర్చోబెట్టేందుకు దాదాపుగా కసరత్తు పూర్తిచేశారన్న అభిప్రాయానికి పార్టీ నేతలు వచ్చారు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఓ తిరుగులేని సక్సెస్ ముద్ర కేటీఆర్ పై వేసి..పీఠంపై కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇప్పుడు తెగించి… నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
కేటీఆర్ ను సీఎం పీఠం పై కూర్చోపెట్టిన తర్వాత మంత్రి వర్గంలో పార్టీలో చేయాల్సిన ప్రక్షాళన మీద కూడా కసరత్తు చేసినట్లు చెబుతున్నారు. సీనియర్లలో అసంతృప్తి చెలరేగకుండా కూడా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.మంచి ముహూర్తం చూసుకుని మార్చి తర్వాత ఈ ప్రక్రియనంతా పూర్తిచేసుకునేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే కొంత మంది ఎమ్మెల్యేలు మార్చి తర్వాత అంటూ ప్రకటనలు ప్రారంభించారు.
టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ ప్రకటించారు.డిసెంబర్ లో పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ రాగానే ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పై ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరుగుతోందన్న భావనతో ఉన్న కేసీఆర్ సమగ్ర ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఒక మూడు నెలలు తెలంగాణలో రాజకీయ హడావుడి ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.