వైఎస్ జగన్మోహన్ రెడ్డితో… తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు… టీఆర్ఎస్ కు చెందిన కొంత మంది నేతల బృందం నేడు చర్చలు జరపబోతోంది. హైదరాబాద్ లోని జగన్ నివాసంలో జరిగే ఈ చర్చల్లో… ఫెడరల్ ఫ్రంట్ అంశం గురింటి మాట్లాడుతామని.. టీఆర్ఎస్ నేతలు మీడియాకు లీకులిచ్చారు కానీ.. అంతకు మించి వారి చర్చల్లో అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి తెలంగాణ ఎన్నికల్లో… వైసీపీ.. టీఆర్ఎస్ కు బహిరంగ మద్దతు తెలిపింది. సీమాంధ్రుల్లోని.. తమ మద్దతుదారులంతా టీఆర్ఎస్ కు ఓటు వేసేలా బహిరంగంగానే ప్రచారం చేశారు. ఎన్నికలు ఫలితాలు… కేసీఆర్ తో పాటు జగన్ నూ ఆనందోత్సాహలతో ముంచెత్తాయి. ఆ ఆనందాన్ని కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి షేర్ చేసుకున్నానని జగన్ స్వయంగా చెప్పారు కూడా.
ఆ తర్వాత కేసీఆర్.. ప్రత్యేకహాదాకు తాను అడ్డం కాదు.. నిలువూ కాదని చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి కేసీఆర్ లో హీరోని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓ సినిమాకి వెళ్తే హీరో క్యారెక్టర్ ని అభిమానిస్తామని.. కేసీఆర్ అలాంటి హీరో అని జగన్ ఇంటర్యూల్లో ఏ మాత్రం సిగ్గపడకుండా చెప్పేశారు. ఆ సమయంలో.. ఆయనకు.. మానుకోట ఘటన గుర్తుందో లేదో.. ఎన్నికల ప్రచారం.. తన తండ్రిని అత్యంత దారుణంగా విమర్శించిన విషయం గుర్తుందో లేదో ఇంటర్యూ చేసే వారికి క్లారిటీ లేదు. అది తర్వాత విషయం. కానీ కేసీఆర్ ఏదో ప్రత్యేకహోదా దాత అయినట్లు… ఆయన ప్రత్యేకహోదా ఇస్తానని.. అవసరం అయితే మోడీకి లేఖ రాస్తానని.. చెప్పిన వెంటనే .. జగన్ కు అక్కడ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక్కడ పాతిక.. అక్కడ పదిహేను.. మొత్తం నలభై.. ఢిల్లీలని గడగడలాడించి… అనుకున్నది తీసుకొస్తామని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా చర్చలు జరగనున్నాయి.
అయితే టీఆర్ఎస్ నేతలు… ఒక్క ఫెడరల్ ఫ్రంట్ విషయంపై మాత్రమే చర్చించరు కదా..! వాళ్లకు ఏపీకి ప్రత్యేక హోదా సాధించి పెట్టాలన్న జీవితాశం ఏమీలేదు. వాళ్లకు కావాల్సింది చంద్రబాబు ఓటమి. అది ఎందుకనేది… ఎవరి ఊహకు అందే కారణం వారికి ఉంటుంది. చాలా మందికి తెలిసేదేమిటంటే.. చంద్రబాబు ఓడిపోతే.. వచ్చే జగన్.. టీఆర్ఎస్ అదుపాజ్ఞల్లో ఉంటారు.. ఏపీని కట్టడి చేయవచ్చనేది. చంద్రబాబును ఓడిస్తేనే అది సాధ్యం కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి ఎలాంటి సాయం టీఆర్ఎస్ చేయాలో కూడా… చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి జగన్.. చంద్రబాబు చేస్తున్న మోడీ – కేసీఆర్ – జగన్ విమర్శలను నిజం చేస్తున్నారు.