తీహార్ జైల్లో ఉన్న కవితతో చాలా రోజుల తర్వాత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె కోసం న్యాయపోరాటం చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. వరుసగా మూడు రోజుల పాటు ములాఖత్ అయ్యారు. తరవాత తిరిగి వచ్చేశారు. కవితకు బెయిల్ రాలేదు. దాంతో తీహార్ జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఎన్నికల హడావుడి పెరగడంతో అసలు పట్టించుకోలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ములాఖత్ కాలేదు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత నిరాశజనక ఫలితాలతో కేటీఆర్ పెద్దగా బయటకు రాలేదు.
చివరికి ఆయన కవిత కోసం ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ విషయాలు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎలాంటి సీట్లు గెలవకపోవడం రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారో చర్చించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కవిత బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలపైనా కవితకు చెప్పినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్టు చేయడంతో ఇప్పటికి మూడు నెలలుగా జైల్లో ఉన్నారు.
బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఇప్పుడు పరిస్థితులు మారుతాయని బీఆర్ఎస్ నేతలు ఆశాభవంతో ఉన్నారు. తమకు మూడు, నాలుగు సీట్లు వచ్చినా పరిస్థితుల్లో కొంత మార్పు ఉండేదని అనుకుంటున్నారు. కానీ ఎలాంటి సీట్లు రాలేదు. అయితే కేంద్రంలో సంకీర్ణ సర్కారే ఏర్పడటంతో .. విపక్షాల పట్ల అంత కఠినంగా ఉండరని బీఆర్ఎస్ వర్గాలు ఆశపడుతున్నాయి.