వచ్చే ఎన్నికల్లో మరోసారి తెరాస అధికారంలోకి వస్తుంది.. ఇదే మాటను రకరకాల మధ్యమాల ద్వారా, వేదికల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర నేతలు చెబుతూ వచ్చారు. ఆ మధ్య సర్వేల సందడి చేశారు. అన్ని సర్వేలూ తెరాసకు అనుకూలంగా వస్తున్నాయనీ, కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా లేదంటూ వ్యాఖ్యానాలు చేశారు. రాజకీయంగా చూసుకుంటే ఇదంతా ఒక రకమైన మైండ్ గేమ్ అనేది అర్థమౌతూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా ఈ తరహా సర్వేలూ అభిప్రాయలూ వంటివి బయటకి తెస్తుంటారు. ఆ సర్వేల సీజన్ అయిపోయినట్టుంది. ఇప్పుడు సవాళ్ల సీజన్ వస్తోంది..!
2019 ఎన్నికల్లో తెరాస మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనీ, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. గద్వాలలో జరిగిన ఓ కార్యక్రమాలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ కూడా చేశారు! ‘సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. మా పనితీరు మీద విశ్వాసం ఉంది. పనిచేసేవారినే ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. ఆ ఆత్మవిశ్వాసంతో సవాల్ చేస్తున్నా… 2019 ఎన్నికల్లో మరోసారి తెలంగాణలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వం రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు ఇంకా 41 సంవత్సరాలే… అయినా ఈ సవాల్ చేస్తున్నా, దీనికి మీరు సిద్ధమా’ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజల మీద తమకు నమ్మకం ఉందనీ, ఆ నమ్మకం మీకుందా అంటూ కేటీఆర్ నిలదీశారు.
సో… ఇదీ కొత్తగా మొదలైన మైండ్ గేమ్..! తమ ప్రభుత్వం పనితీరుపై నమ్మకం ఉందనీ, పనిచేసేవారినే ప్రజలు ఆదరిస్తారని కేటీఆర్ చెబితే… దీనికి కాంగ్రెస్ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి. నిజానికి, అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ‘తాము పనిచేస్తున్నామ’ని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఆ పని ద్వారా ప్రజల అవసరాలు తీరుతున్నాయా లేదా అనేది వేరే చర్చ. కానీ, అధికారంలో ఉన్న పార్టీకి ‘పని చేస్తున్నాం’ అని ఢంకా బజాయించి చెప్పుకునే వెలుసుబాటు ఉంటుంది. ఈ పరిస్థితి ప్రతిపక్షాలకు ఉండదు కదా! ‘మీ పనితీరుపై మీకు నమ్మకం ఉందా’ అని ప్రతిపక్షాలకు సవాల్ చేస్తే… వాళ్లు ఎలా స్పందిస్తారు..? వాళ్లకి పనితీరు అంటే ప్రత్యేకంగా ఏముంటుంది… అధికార పార్టీ లోటుపాట్లను ఎత్తి చూపి విమర్శలు చేయడం తప్ప! పోనీ, అలాగని విమర్శలు చేస్తుంటే… సొల్లు కబుర్లు చెప్పడం కాదంటూ మంత్రి కేటీఆర్ మండిపడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ సర్వేల పేరుతో ప్రతిపక్షాలను సందిగ్దంలో పడేస్తూ వచ్చారు. ఇప్పుడు… సవాళ్లతో కొత్త అంకానికి తెర లేపుతున్నారు. ప్రతిపక్షాల పనితీరు ఏదీ అని ప్రశ్నిస్తే… వారి దగ్గర నుంచి సమాధానం ఏమొస్తుంది..? మరి, కేటీఆర్ సవాలుకి ఉత్తమ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.