ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. మామూలుగా ఆయన మాటల ధాటి తెలిసిన వారు, ఏం మాట్లాడినా వంతపాడే వారు కూడా ఈ సారి కొంచెం శ్రుతిమించిందని ఒప్పుకోక తప్పని స్థితి.అయితే కెసిఆర్ ఇంతగా మండిపడటం వెనక ఖచ్చితమైన నేపథ్యం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. కుమారుడు, అధికార వారసుడు కెటిఆర్‌పై ఒక్కుమ్మడిగా దాడి జరుగుతున్న తరుణంలో తండ్రిగానూ ప్రభుత్వాధినేతగానూ ఆయనను సమర్థించడానికి సంరక్షించడానికి కావాలనే కెసిఆర్ తీవ్రంగా మాట్లాడారట. మరీ ముఖ్యంగా వెంకయ్య నాయుడుపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే క్రమంలో కెటిఆర్ చెప్పిన కొన్ని మాటలు నిజం కాదని ఆధారాలతో సహా తేలింది. అసలు ఆ స్థాయిలో ఆ తీరులో సమాధానం ఇవ్వడమే సరికాదన్న భావన కూడా పాలకపక్షంలో వుంది. హిమాన్షు మోటార్స్ ఏడెనిమిదేళ్ల కిందటే మూత పడిందని, కావాలంటే రాసిస్తానని వ్యాఖ్యానించిన కెటిఆర్ 2015లో కూడా కంపెనీ డైరెక్టర్‌గా తనే సంతకం చేసిన సంగతి మర్చిపోయారు. 2014,15 సంవత్సరాలలో బోర్డు సమావేశాలలో ఆయనకు యాభై శాతం హాజరు కూడా నమోదైంది! కనుక ఎప్పుడో మూత పడిన మాట నిజం కాదన్నది స్పష్టం. ఈ పత్రాలు కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతల చేతుల్లో వున్నాయి. ఎన్నికల సంఘం ముందు దాఖలు చేసిన అఫిడవిట్లోనూ వున్నాయి. మరి మంత్రి ఇవన్నీ మర్చిపోయి మాట్లాడారా తెలియదు. అలా అన్న తర్వాత తనే సమర్థించుకోలేరు గనక నాన్న గారి ప్రవేశం అవసరమైంది.
ఇక రెండవది సిరిసిల్లా జిల్లా నేరెళ్లలో ఇసుకరవాణా లారీ కింద మనిషి చనిపోతే తగలబెట్టారని గ్రామాలపై దాడి చేయడం. కొందరు దళితులతో సహా తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టడం. ఆ లారీలు కెటిఆర్ సన్నిహితులవనేది ఒక వాదన . అయినా కాకున్నా నియోజకవర్గ ఎంఎల్ఎగా శక్తివంతుడైన మంత్రిగా బాధితుల తరపున ఎందుకు జోక్యం చేసుకోలేదు? వెంటనే ఎందుకు ఖండించలేదు? ఈ ప్రశ్నలు ఆయనను వెంటాడుతున్నాయి. అందుకే కెసిఆర్ ఘటన దురదృష్టకరమైందని, ఎవరూ పోలీసులను అలా చేయమని చెప్పరని అంటూనే రౌడీయిజాన్ని సహించాలా? దళితులను మొహం మీద రాసి వుంటుందా అని ముఖ్యమంత్రి ఎదురు దాడి చేశారు. విశేషమేమంటే ఇప్పటి వరకూ కెటిఆర్ ఈ మాత్రమైనా ఖండించలేదు. కాబట్టి కెసిఆర్ కూడా దురదృష్టకరం అంటూనే మళ్లీ ఎదురు దాడి కొనసాగించారు. ఎంతైనా నాన్నకు తప్పదు కదా! కెటిఆర్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ఎన్నికలు గెలిచినప్పుడు నాన్నకు ప్రేమతో అన్నారు. ఇప్పుడు కుమారుడికి బాధ్యతతో అంటూ సమర్థన చేశారు కెసిఆర్. అంతే.