పార్టీ ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించిన బీఆర్ఎస్… అధికారం కోల్పోగానే రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతోంది.పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీది ద్వంద విధానం అని మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఎన్నో మాట్లాడారని.. గెలిచాక ఒక మాట, గెలవకముందు మరో మాట అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ఎంత మాట్లాడినా వృధానే. ఆయనకు బయట నుంచి మద్దతు కూడా లభించడం లేదు. కారణం.. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్సే. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఇబ్బడిముబ్బడిగా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. కానీ అధికారం కోల్పోయేసరికి కేటీఆర్ కు రాజ్యాంగ విలువలు గుర్తుకొచ్చాయి.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం నైతికత అని కేటీఆర్ అంటున్నారు. కానీ, ఈ సోయి గతంలో ఏమైందనే ప్రశ్నలు బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తాయని ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదు. పార్టీ ఫిరాయింపులపై దూకుడుగా వ్యవహరించి ఎమ్మెల్యేలను చేజారిపోకుండా చేసుకోవాలనేది కేటీఆర్ ఉద్దేశ్యం కానీ,ఈ విషయంలో ఆయన ఏం మాట్లాడినా అవన్నీ బీఆర్ఎస్ ను వేలెత్తి చూపించేలా ఉంటాయి.కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ గత తప్పిదాలను తవ్వి తీసినట్లు అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.